
తెలంగాణలో మరో కొత్త పత్రిక రాబోతోంది.. టీఆర్ఎస్ పార్టీ ఈ కొత్త పత్రిక తేవడానికి నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లతో తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాలు, విజయగాథలను ప్రజల్లోకి తీసుకెళుతోంది.. ఇక హైదరాబాద్ లోని తెలుగు రాని వాళ్లు, అలాగే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలకు ప్రాచుర్యం కల్పించే వ్యూహంలో భాగంగా ‘ఆంగ్ల పత్రికను’ స్థాపించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
‘తెలంగాణ టుడే’ పేరుతో వచ్చే ఈ కొత్త ఆంగ్లపత్రికకు ఇప్పటికే ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ల నుంచి సీనియర్ పాత్రికేయులను టీఆర్ఎస్ సంప్రదించి వారికి జీతాలు ఆఫర్ చేసిందట.. వారు కూడా సరేననడంతో ఈ దసరాకు తెలంగాణ టుడే పత్రిక దేశవ్యాప్తంగా ప్రచురణకు సిద్ధం కానుంది. దీనివల్ల చాలామంది జర్నలిస్టులకు ఉపాధి లభించనుంది.
ఇన్నాళ్లు తెలుగుకే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ ఈ పత్రిక సాయంతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించేందుకు అలాగే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకునేందుకు పత్రికను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ టుడే పత్రికను లాంచ్ చేస్తోంది.