
సీఎం కేసీఆర్ తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ అంటూ కాంగ్రెస్, టీడీపీల నుంచి తెలంగాణ కోసం కనీసం ఉద్యమించని నాయకులను టీఆర్ఎస్ చేర్చుకుంటున్నారు..అంతవరకు బాగానే ఉన్నా.. వీరి చేరికతో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగుతున్న వారిలో గుబులు రేపుతోంది..
మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ లో చేరికతో పెద్దపల్లి ఎంపీ సీటు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఇస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ లో ఉండి చివరి నిమిషంలో కాంగ్రెస్ లోకి జంప్ అయి వివేక్ పెద్దపల్లి ఎంపీ సీటుకు పోటీ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ స్థానంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న బాల్క సుమన్ పెద్దపల్లి ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి ఏకంగా వివేక్ నే మట్టికరిపించి సంచలనం రేపాడు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఎవరికి ఇస్తారనే ప్రశ్న ఉత్పన్న మవుతోంది.
అలాగే వివేక్ అన్న వినోద్ చేరికతో ఆయన పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ స్థానంపై కూడా పీటముడి నెలకొంది. అక్కడ టీఆర్ఎస్ తరఫున గెలిచిన ప్రభుత్వ విప్ ఓదెలు కొనసాగుతున్నారు. వినోద్ చేరికతో మరి వచ్చేసారి ఎవరికీ ఇస్తారనే సందేహం ఉంది.
అలాగే నల్గొండ బరిలో గుత్తా ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. మరి వచ్చే ఎన్నికల్లో దీనిపై ప్రశ్నార్థకం నెలకొంది.
ఇలా అందరినీ చేర్చుకుంటున్న కేసీఆర్ అసలైన ఉద్యమకారులకు ద్రోహం చేస్తారా.. లేక వారిని ఎక్కడ సర్దుబాటు చేస్తారా అన్నది పార్టీ నాయకులు చర్చించుకుంటుననారు.