కొత్త జిల్లాల అప్ డేట్..

TS_NEW_DISTRICTS_Revenue_Div Final

జిల్లాల ఏర్పాటు కసరత్తు తుదిదశకు చేరుకున్నది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా 27 జిల్లాలు.. అక్టోబర్ 11న దసరా పండుగరోజున ఆవిర్భవించనున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు జిల్లా కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు.. నూతన జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలతోపాటు ఇతర కార్యాలయాలను ఎంపిక చేసి, వాటి అగ్రిమెంట్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్లను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఏ రోజుకు ఏ పని పూర్తి కావాలో తెలియజేస్తూ చెక్‌లిస్టును కూడా విడుదల చేసింది. అక్టోబర్ 5 నాటికి ఆయా భవనాల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే పూర్తిచేయాలి. ఆయా జిల్లాలకు కావాల్సిన రికార్డులను తరలించాలి, స్టేషనరీ సామగ్రిని సిద్ధం చేయాలి. బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇలా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేవిధంగా కలెక్టర్ కార్యాలయాలను ఆదేశించారు.

✅స్వల్పమార్పులకు ఆమోదం
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా ఇప్పుడున్న 10 జిల్లాలకు అదనంగా 17 కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. మొత్తం 27 జిల్లాల ఏర్పాటుపై సర్వత్రా ఆమోదం లభించింది. చిన్నచిన్న మార్పు లు కోరుతూ వచ్చిన విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమాచారం తెప్పించుకొని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్‌ను రెండు జిల్లాల పరిధిలో కాకుండా.. ఒక్క జిల్లాలోనే ఉంచాలన్న విజ్ఞప్తిని ఆమోదించారు. వరంగల్‌లోని గ్రామీణప్రాంతాలను ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తూ, అలనాటి కాకతీయ సామ్రాజ్యం స్ఫూర్తిగా కాకతీయ జిల్లా అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వరంగల్‌లోనే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే వికారాబాద్ కేంద్రంగా ఏర్పడనున్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొయినాబాద్ మండలాన్ని ప్రజాభిప్రాయం మేరకు శంషాబాద్‌లో కలపాలని నిర్ణయించారు. ఇలా చిన్నచిన్న మార్పులు మినహా దాదాపుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగానే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

దీనిపై కసరత్తు పూర్తి కావచ్చిందని తెలిసింది. అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికంటే మరో రెండు రెవెన్యూ డివిజన్లు అదనంగా పెరుగనున్నాయి. ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరుతోపాటు మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 45 నూతన మండలాలకు అదనంగా మరో 30కిపైగా కొత్తమండలాలు వచ్చే అవకాశం ఉన్నది. తమప్రాంతాలను మండలాలుగా ఏర్పాటు చేయాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతన మండలాల ఏర్పాటుపై అధికారులు తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. ఇది చివరిదశలో ఉన్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *