ఆంధ్రాపత్రికలతో బంగారు తెలంగాణ సాధ్యమా..?

ఈ వ్యాసం మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ రచించిన తెలంగాణ చిన్న పత్రికలు పుస్తకం లోనిది..

r

-అస్థిత్వ పోరాటంపై సమగ్ర పుస్తకం పాఠం ఇదీ..
– ఆంధ్రా పత్రికలతో బంగారు తెలంగాణ సాధ్యమా..?
– అక్షర బానిసత్వం ఇంకెన్నాళ్లు..?
సమాచారం ఒక పదునైన ఆయుధం. ఎవరైనా, తమకు తెలిసిన సమాచారం ఆధారంగానే ఏ విషయంపైనైనా ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ తప్పుడు సమాచారం అందితే తప్పుడు అభిప్రాయానికి వస్తారు. తప్పుడు అభిప్రాయం ఏర్పడితే తప్పుడు నిర్ణయమే తీసుకుంటారు. అందుకే ఏ అంశం మీదనైనా సరైన సమాచారం ఉండాలి. అప్పుడే సరైన అభిప్రాయం ఏర్పడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇంతటి ప్రాధాన్యమున్న సమాచార రంగం, తెలంగాణాలో ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది?. ఇది అందరూ అలోచించాల్సిన విషయం. తెలంగాణ సమాచార రంగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకొన్న ఆంధ్రా మీడియా కొన్ని దశాబ్దాలుగా యధేచ్చగా పరిపాలిస్తోంది. ఈ ప్రాంతంలో వాళ్లు రాసిందే వార్త. వాళ్లు పెట్టిందే శీర్షిక అన్నట్లుగా ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. ఆంధ్రా పత్రికల్లో ఏది రాస్తే అదే నమ్మాల్సిన పరిస్థితి. జర్నలిజం విలువలు, ప్రమాణాలు ఏనాడో గంగలో కలిశాయి. వక్రీకరించే వారి చేతుల్లో సమాచారం ఉంటే అది ఎలా వక్రీకరణలకు గురవుతుందో, ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో ఈనాటి ఆంధ్రా పత్రికలను, మీడియాను పరిశీలిస్తే అర్థమయిపోతుంది.
ఆంధ్రా పార్టీలు, పాలకులు, నాయకులు సాగించిన అణచి వేతను ధిక్కరిస్తూ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ఉద్యమం, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమం సఫలమై స్వరాష్ట్రం సాకారమైంది. ఇపుడు బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా పార్టీలెందుకు? అన్న నినాదంతో ఆనాడు ప్రజా పోరాటాలు సాగించాం. అనుకున్నట్లుగానే ఆంధ్రాపార్టీల పెత్తనాన్ని బద్దలుకొట్టగలిగాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాంక్షించని ఆంధ్రా రాజకీయ పార్టీల ప్రాబల్యాన్ని నిర్మూలించేందుకు గతంలో జరిగినట్లుగానే ఇపుడు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి సఫలమౌతున్నాయి కూడా. ఎవరేమనుకున్నా తెలంగాణ అస్తిత్వంపై అంతులేని దాడి చేసిన ఆంధ్రా పార్టీలను సమూలంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కడవరకు కొనసాగవలసిందే.
సొంత రాష్ట్రానికి సొంత పార్టీ.. ఇంటి పార్టీ ఉంది. కానీ ప్రజల అభిప్రాయాలపై బలమైన ముద్ర వేసే సమాచార రంగంలో మాత్రం మనం పూర్తిగా వెనుకబడి ఉన్నాం. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, వాణిజ్య, వ్యవసాయ, సాంస్కతిక మూలాలన్నింటిలోకి ఆంధ్రా పత్రికలు చొచ్చుకు పోయాయి. ప్రజల అభిప్రాయాలను మార్చగలిగే, ఏమార్చగలిగే స్థితికి అవి చేరుకున్నాయి. ఎలాంటి పరిణామాన్నయినా నిర్దేశించ గలుగుతున్నాయి. ఆంధ్రా యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఈ పత్రికలు తెలంగాణ ప్రజల మనోభావాలపైనా, భాష – యాస పైన, పండుగలు – సంస్కతిపైన తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. పెత్తనం చెలాయిస్తున్నాయి. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపిస్తూ అదే నిజమని భ్రమింపజేస్తున్నాయి. అందుకే తెలంగాణ స్వప్నం సాకారం కావడానికి జరిగినంత స్థాయిలో ఇపుడ వీటిపై సైద్ధాంతిక సమరం సాగించాల్సిన అవసరం ఉంది. మన భాషను, యాసను అవమానపరిచే, మన నడతను, నడవడికను తృణీకరించే, మన సంస్కతీ సాంప్రదాయాలను అగౌరవపరిచే పరిస్థితి పోవాలంటే సొంత రాష్ట్రం, సొంత పార్టీ లాగే సొంత పత్రికలు కూడా రావాల్సిన అవసరముంది.
అక్షర బానిసత్వం ఇంకెంత కాలం?
ఆంధ్రా పార్టీలకు పునాది ఆంధ్రా పత్రికలేనన్న విషయం అందరికీ తెల్సిందే. ఆంధ్రా పాలకులకు కూడా ఈ పత్రికలే పునాది. మనం ఆంధ్రా పత్రికలపై దృష్టిపెట్టకపోతే పునాదిని వదిలేసి కొమ్మలను పట్టుకుని వేలాడినట్టవుతుంది. సొంత రాష్ట్రంలో ఆంధ్రా పత్రికల ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఏం చేయాలనేది నేటి మన తక్షణ లక్ష్యంగా ఉండాలి. ఆ పత్రికలకు దీటుగా సొంత పత్రికలను అభివృద్ధి చేసుకోనట్లయితే శాశ్వత అక్షర బానిసత్వం, శాశ్వత పరాధీనత తప్పవు. సొంత రాష్ట్రంలో పరాయి అభిప్రాయాలను శ్వాసించాల్సిన పరిస్థితిలో నేడు మనమంతా ఉన్నాం. ఈ పరిస్థితి పోవాలి. ఇది ఇలానే కొనసాగితే విపరిణామాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిని అంతిమంగా ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. ఆంధ్రా పత్రికల ప్రాబల్యాన్ని మనం ఈ కోణంలో చూడాల్సి ఉంది. అందుకే ఆ పత్రికలకు దీటుగా మనం సొంత పత్రికలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. అక్షర బానిసత్వపు సంకెళ్ల నుండి తెలంగాణ తల్లిని విముక్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆంధ్రా ఆదిపత్య వాదానికి చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ వాదిపై ఉంది.
ఆంధ్రా మీడియా ఆర్ధిక దోపిడి
దశాబ్దాలుగా ఆంధ్రా పత్రికలు జర్నలిజం విలువల వలువలను ఒలిచి అనైతిక పద్ధతులను అనుసరిస్తూ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరంగా తయారయ్యాయి. జర్నలిజం ముసుగులో ఇక్కడి వనరులను కొల్లగొట్టాయి. ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ప్రచురణలోనే లేని అనేక పత్రికలకు ఇక్కడి విలువైన భూములను కేటాయించారు. అనేక తెలుగు, ఇంగ్లీషు పత్రికలు జర్నలిజం ముసుగులో ఇలా విలువైన భూములను కాజేశాయి. అందులో ఆంధ్రా యాజమాన్యాలదే మెజారిటీ భాగం. ఐదు దశాబ్దాలుగా ఆంధ్రా పత్రికలు కోట్ల కొద్దీ ధనాన్ని లూటీ చేశాయి. ఇప్పటికీ తెలంగాణ లోని టాప్‌ 10 పత్రికలు ఆంధ్రా ప్రాంతానికి చెందినవే. తెలంగాణలో భూసేకరణ చేయడానికి పత్రికా ప్రకటనలు జారీ చేస్తుంటే అందులో 90శాతం ప్రకటనల నిధులు ఆంధ్రా పత్రికలకే పోతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత జారీ చేసిన పత్రికా ప్రకటనల విలువ సుమారు రూ. 200 కోట్లు. అందులో రూ.180 కోట్లకు పైగా నిధులు ఆంధ్రా పత్రికలకే వెళ్లాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒకటి రెండు మినహాయింపులున్నా… ఎవరూ వందల కోట్లతో పత్రికలు ప్రారంభించలేదు. సింగిల్‌ ప్రెస్‌తో పత్రిక ప్రారంభించిన వారు వేల కోట్లకు ఎదిగారు. అధికార అండదండలతో ఇష్టారీతిన ప్రకటనల (యాడ్స్) రేట్లు పెంచుకుని దోపిడీ చేయడం ద్వారానే వారు ఆ స్థాయికి చేరుకున్నారు.
తెలంగాణలో ఆంధ్రా రాజకీయ పార్టీలను గద్దెదింపి, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి మలివిడత 2001 లో ప్రారంభమైన ఉద్యమానికి లక్ష్య సాధన కోసం 14 ఏళ్ళు పట్టింది. స్వరాష్ట్రం సాధించి రెండేళ్లు పూర్తయింది. అయితే, ఆంధ్రా రాజకీయ పార్టీలకు జవసత్వాలుగా ఆక్సిజన్‌ అందించి, ఎదిగిన ఆంధ్రా పత్రికలను మాత్రం ఇప్పటికీ తల పైన పెట్టుకొని సకల సౌకర్యాలను మనం కల్పిస్తూనే ఉన్నాం. ఆంధ్రా పత్రికల రాజకీయ చతురత, అక్కడి నేతల పాలనలో నుజ్జునుజైన తెలంగాణ స్ధానిక పత్రికలు ఉద్యమ కాలంలో ఆంధ్రా నేతల కన్నెర్రకు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఆంధ్రా పత్రికల ఆర్ధిక దోపిడి ఇంకా కొనసాగుతూనే వుంది. ఉమ్మడి రాష్ట్రంలో సమాచారశాఖకు కేటాయించే బడ్జెట్‌ 120 కోట్లల్లో 98 శాతం మేరకు ఆ పత్రికలే సొంతం చేసుకున్నాయి. జివో .ఎం.ఎస్‌ నం.342 లో పేర్కొన్నట్టు సర్క్యులేషన్‌ ఎబిసి సర్టిఫికెట్‌ ఆధారంగా పరిగణించాలన్న నిబంధనకు కూడా సవరణలతో చార్టెడ్‌ అక్కౌంటెంట్‌ సర్టిఫికెట్‌ సరిపోతుందని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో పెద్ద పత్రికల జాబితాలో చేరిన టాప్‌టెన్‌లో 7 పెద్ద పత్రికలు స్క్వేర్‌ సెంటీమీటర్‌ రేటుతో ఎలాంటి అధికార తనిఖీలు లేకుండా తెలంగాణాలో ఎడిషన్లు ఉన్నట్టు చూపించి జిల్లా రేట్లు, ప్రాంతీయరేట్లు, రాజధాని నగర రేట్ల పేరుతో ఏటా సుమారు 105 కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో కాజేశాయి.
రెండు దశాబ్ధాల కాలంలో రెండు వేల కోట్లకు పైగా పెద్ద పత్రికల పేరుతో ఆంధ్రా మీడియా కొల్లగొట్టినట్టు అధికార లెక్కలే చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు పొందాలంటే కనీసం 18 నెలల పాటు పత్రిక రెగ్యులారిటీ ఉండాలన్న జివో నం.646 ను ఉల్లంఘించిన జాబితాలో ప్రముఖ పత్రికలుగా చెబుతున్న ఆంధ్రాకు చెందిన సాక్షి, సూర్య లాంటివి ఉండగా మధ్యంతరంగా ఆగిపోయిన ఆంధ్రజ్యోతి, ఆంధప్రభ లాంటి పత్రికలు కూడా పత్రిక ప్రచురణ నిలిచిపోయిన కాలాన్ని కూడా రెగ్యులారిటీ క్రింద చేర్చుకున్నాయి. తద్వారా జివో నం.431, జిఓఎంఎస్‌ నం.323లను ఉల్లంఘించాయి.
పత్రికల నిర్హహణలో న్యూస్‌ ప్రింట్‌, ఇంకులు, ప్లేట్ల ధరల పెరుగుదల దృష్ట్యా ఏడాది కోసారి రేట్లు పెంచాలన్న జిఓ ఎంఎస్‌ నం.431ను ఉల్లంఘించి ప్రతీ 6 నెలలకోసారి ఆంధ్రా పత్రికల రేట్లు పెంచడానికి ‘పెద్దాయన’ల మాట ఐఎఎస్‌లకు హుకుంలా పనిచేసింది. తద్వారా కోట్లాది రూపాయాలు ఆంధ్రా మీడియా పరమయ్యాయి. ఏ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినా చివరికి జిల్లా, మున్సిపల్‌, గ్రామస్ధాయిలో రోడ్డు వేయాలన్నా భూసేకరణ చట్టం ప్రకారం ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రకటనలు కూడా ఆంధ్రా మీడియాకే చెందేట్టుగా కూడా జిఓలో సవరణలు చేసుకున్నారు. స్క్వేరు సెంటిమీటరు రేటున్న పెద్ద పత్రికలకే యాడ్స్ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్లకు, స్పెషల్‌ కలెక్టర్లకు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర సచివాలయం నుండి ఆదేశాలు జారీ చేశారు. అంటే, తెలంగాణ భూమిలో తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేయాలన్నా ఆంధ్రా యాజమాన్యం లోని పెద్ద పత్రికలకే ప్రకటనలు విడుదల చేసే అర్హతను కట్టబెట్టాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్న స్వరాష్ట్రంలో కూడా ఇంకా ఇది కొనసాగుతూనే వుంది.
తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక కూడా జారీచేసిన జిఓఎంఎస్‌నం.84లో కూడా టాప్‌ 10 పత్రికల్లో నమస్తే తెలంగాణ, కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన రెండు పత్రికలు మినహా మిగతావన్నీ ఆంధ్రా యాజమాన్యంలో వెలువడుతున్నవే కావడం గమనార్హం. కొన్ని దిన పత్రికలు, తెలంగాణ ఎడిషన్లను ఎత్తి వేసినప్పటికి రేటులో మాత్రం తగ్గకుండా జి.ఓలో పేర్కొనడం వెనుక ఇంకా ఆంధ్రా మీడియా పెత్తనం తెలంగాణలో కొనసాగుతోందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలోనామినల్‌ రేటుతో పత్రిక నిర్హహణ కోసం భూములను తీసుకున్న ఆంధ్రా మీడియా యాజమాన్యాలు అర్ధాంతరంగా పత్రికల్ని మూసివేసినప్పటికీ• ఆ భూముల్ని ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకోకుండా నిరోధించ గలుగుతున్నాయి.
ఎంత దోచుకోవాలో వారే నిర్ణయించుకున్నారు..
ఆంధ్రా పత్రికలు పాలకులను అడ్డుపెట్టుకుని వాళ్లకు కావలసిన విధంగా జీవోలు తెచ్చుకున్నాయి. వాళ్లకు కావలసిన మేరకు ప్రకటనల రేట్లు ఇష్టానుసారంగా నిర్ణయించుకున్నాయి. వ్యాపారం పేరుతో వచ్చి దోచుకున్న బ్రిటిష్‌వారి మాదిరిగా ఆంధ్రా పత్రికల యాజమాన్యాలు, ఆంధ్రా పాలకులను అడ్డుపెట్టుకుని దోపిడీ సాగించాయి. ఈ పత్రికలకు అనుకూల ముఖ్యమంత్రులు ఉన్నపుడు కోట్ల కొద్దీ నిధులను ప్రకటనల పేరుతో కొల ్లగొట్టారు. పత్రికల ప్రకటనల కోసం, వాటికి ప్రత్యేకంగా మేలు చేయడం కోసం అనేక జీవోలు విడుదల చేశారంటే వాటికున్న ప్రాధాన్యత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రా పత్రికలను బలోపేతం చేయడానికి ఆంధ్రా ప్రాంత ముఖ్యమంత్రులు, నాయకులు క్రియాశీల పాత్ర పోషించారు. వారికి విరివిగా రుణాలు, స్థలాలు ఇచ్చారు. రేట్లు పెంచి విరివిగా ప్రకటనలు ఇచ్చి ఆదుకున్నారు. ఒక పత్రిక కోసం ఒక ముఖ్యమంత్రి ఏకంగా 9 మంది డైరెక్టర్లను సమకూర్చడం మనం చూశాం. ఎందుకంటే పత్రికల ప్రాధాన్యత అటువంటిది. వాటితో వారికున్న అవసరం అలాంటిది. తెలంగాణలో జరిగిన సామాజిక, నక్సలైట్‌, తెలంగాణ ఉద్యమాలు, కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు ఈ పత్రికలు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తూనే పాలకులతో మిలాఖత్‌ అవుతూ సొమ్ముచేసుకున్నాయి. ఆంధ్రా ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఆ పత్రికల సర్క్యులేషన్‌ గానీ, యంత్ర సామాగ్రి సామర్థ్యం గానీ, ప్రకటనలు జారీ చేయడానికి అవసరమైన ప్రమాణాలను గానీ తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఇలా ఐదు దశాబ్దాలలో వేల కోట్ల రూపాయలను ఆంధ్రా పత్రికలు లూటీ చేశాయి.
తెలంగాణ పత్రికల పరిస్థితి
స్థానిక పత్రికలు గతంలోనే కాక ఇప్పుడు కూడా ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాయి. తెలంగాణ సొంత పత్రికలయినప్పటికీ వాటికి ఆదరణ, ప్రోత్సాహం లేవు. స్వరాష్ట్రంలో పరాయీకరణ భావన పెరుగుతోంది. దాని తాలూకు దుష్ప్రభావాలను అవి మౌనంగా భరిస్తున్నాయి. తెలంగాణ పత్రికల యాజమాన్యాలు సొంత గడ్డపై పరాయివారుగా కొనసాగుతున్నాయి. స్వరాష్ట్రం సాధించుకుని సొంత పార్టీ నాయకత్వంలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం. నీటి పారుదల రంగంలో రాబోయే 100 ఏళ్లకు బాటలు వేసుకుంటున్నాం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అదే సమయంలో అత్యంత కీలకమైన సమాచార రంగంలో… అందులోనూ పత్రికా రంగంలో స్థితిగతులు మారటం లేదు. ఇది ఇలానే కొనసాగితే రాబోయే 100 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో పత్రికా రంగాన్ని ఆంధ్రా పత్రికలే శాసిస్తాయి. అంటే ఆంధ్రా యాజమాన్యాలే శాసిస్తాయన్నమాట.
స్థానిక పత్రికలపై తక్కువ భావన : ఆంధ్రోళ్ల కుట్ర
దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఆంధ్రా పత్రికలు స్వరాష్ట్రంలో కూడా ఆదిపత్యాన్ని కొనసాగించేందుకు అవసరమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ పత్రికలపై చిన్న భావన కలిగేలా అధికారులను మేనేజ్‌ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏళ్లు కాదు కదా, దశాబ్ధాలు గడిచినా పరాయి రాష్ట్ర పత్రికలపై ఆధారపడక తప్పదు. స్థానిక సమస్యలు, సంస్కతి, భాషపట్ల, స్థానిక పత్రికలకుండే ఆత్మీయభావం ఎన్నికోట్ల రూపాయల ఆర్థిక సహాయం పొందినా పక్కింటి పత్రికలకెందుకు ఉంటుంది?. చిన్న పత్రికలు,పెద్ద పత్రికలకున్న ఏకైక లక్ష్మణరేఖ సర్క్యులేషన్‌, అయితే పెద్ద పత్రికలుగా కోట్లాదిరూపాయలు కొల్లగొడుతున్న టాప్‌టెన్‌ పత్రికల సర్య్కులేషన్‌ను తనిఖీ చేసిందెవరన్నదానికి సమాధానం ఉండదు. రాజకీయ ప్రాల్యం కోసం ఆంధ్రా లీడర్లు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో అనామతుగా పెద్దపత్రికల జాబితాలో చేరిన వాటిని నిశితంగా తనిఖీచేసి వాటి స్థానాన్ని నిర్దారించే ప్రయత్నాలు ఇప్పటికీ జరుగడం లేదు.
తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా యాజమాన్యాల గుప్పిట్లోని బడా పత్రికలు నిర్లక్ష్యం వహించినప్పటికీ, స్ధానిక పత్రికలే నిబద్దతతో పనిచేశాయని చెప్పకతప్పదు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఏదైనా కుంభకోణం, అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయంటే అవి చిన్న పత్రికల ద్వారేనన్నది నిఖార్సయిన నిజం. బోఫోర్స్, హెలికాప్టర్‌ల కొనుగోలు, బీహార్‌లో గడ్డి తదితర కుంభకోణాలన్నింటినీ వెలుగులోకి తెచ్చింది కూడా స్థానిక పత్రికలేనన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన పత్రికల ఉనికిని దెబ్బతీయడానికి పెద్దఎత్తున కుట్ర జరిగింది. పత్రికల ప్రింటింగ్‌ సామర్థ్యం, సర్య్కులేషన్‌ను నెపంగా చూపించిన ఆంధ్ర పత్రికల యాజమాన్యాలు, తెలంగాణలో భారీ పెట్టుబడులు సాధ్యం కావనీ అవన్నీ సర్య్కులేషన్‌ లేని చిన్నపత్రికలని గోబెల్స్ ప్రచారాన్ని కొనసాగించాయి. ఈ నేపథ్యంలోనే జీవో.ఎం.ఎస్‌.నెం.281 తేది:26.5.1989ని మార్పుచేసి జీవో ఎం.ఎస్‌ నెం.646ను విడుదల చేయడం ద్వారా పెద్దపత్రికల జాబితాలో ఆంధ్రా పత్రికలను చేర్చడానికి అనుకూలమైన నిబంధనలను సమకూర్చుకున్నాయి. ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వలేని కారణంగా ఒక పత్రికను, రాజకీయ కారణాల వల్ల మరో పత్రికను పెద్ద పత్రికల జాబితాలో చేర్చి ఆర్థిక దోపిడీకి తెరతీశారు. ఈ రాజకీయ, ఆర్థిక పోటీలో తట్టుకోలేని తెలంగాణ స్థానిక పత్రికలను చిన్నస్థాయిలో చూపించి అవి ఆర్థికంగా నిలదొక్కుకోకుండా ఐఏఎస్‌ అధికారుల స్థాయిలో మౌఖిక ఆదేశాలను జారీ చేయడంలో ఆంధ్రా పత్రికల యాజమాన్యాలు విజయవంతమయ్యాయి.
స్థానిక జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులైన అక్రెడిటేషన్‌ తద్వారా పొందుతున్న బస్‌ ప్రయాణ రాయితీ, ఆరోగ్య భీమా, ఇంటి స్థలాలు పొందాలంటే కూడా ఆంధ్రా యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన దుస్థితి. సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక పత్రికలలో జర్నలిస్టులు పని చేయకుండా నిర్వీర్యం చేయడానికి మెమొనెం.2573 ద్వారా ప్రత్యేకంగా చిన్నపత్రికలకు ఒక జిల్లాలో ఒకే అక్రెడిటేషన్‌ మంజూరు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఆదేశాలు జారీచేశారు. దీంతో అప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమంలో తమ గొంతుకను వినిపిస్తున్న స్థానిక పత్రికలు ఒక్కసారిగా నీరు గారిపోయాయి. ఆ నేపథ్యంలో ఆర్థిక పరిపుష్టి గలిగిన ఆంధ్రా పత్రికలను అబ్‌కంట్రీ మీడియాగా గుర్తించి స్థానిక పత్రికలకు నిబంధనలలో సడలింపులుంటే తప్ప వచ్చే దశాబ్ద కాలంలో కూడా స్థానిక పత్రికల మనుగడ సాధ్యం కాదన్నది ఆచరణ నేర్పుతున్న పాఠం. అయితే ఈ దిశలో అడుగులు పడడం లేదు. పైగా తెలంగాణలో స్వరాష్ట్రం సిద్ధించి స్వయం పాలన వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ తెలంగాణ లోని 10జిల్లాలలో పనిచేస్తున్న సుమారు 16వేల మంది ••లం కార్మికులు ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన అక్రెడిటేషన్ల తోనే మగ్గుతున్నారంటే అధికార యంత్రాంగం పనితీరు ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
నైపుణ్యం తెలంగాణ సొత్తు…
జర్నలిజం, సాహిత్యం పరంగా తెలంగాణలో అపారమైన నైపుణ్యం ఉంది. యాజమాన్యాలు ఆంధ్రావారైనా మెజారిటీ పత్రికలలో సంపాదకులు, సహ సంపాదకులుగా తెలంగాణ వారు ఉండడమే ఇందుకు నిదర్శనం.సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కె. రామచంద్రమూర్తి, ఎడిటర్‌గా పనిచేస్తున్న వి. మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, వార్త ఎడిటర్‌ దామెర్ల సాయిబాబా, ఇటీవలి వరకు ఎడటర్‌గా వున్న టంకశాల అశోక్‌ తదితరులంతా తెలంగాణకు చెందినవారే. అయితే పరిపాలనా విభాగాలు, కీలకమైన రిపోర్టింగ్‌ బాధ్యతల్లో మాత్రం ఆంధ్రా వారే కొనసాగుతున్నారు. దాదాపు అన్ని ఆంధ్రా పత్రికలో కూడా కుల వివక్ష, బాష, యాసలకు సంబంధించిన వివక్ష కొనసాగుతోంది.
ఆంధ్రా పత్రికలతో జరుగుతున్న నష్టం.
విభజన తర్వాత స్థానికతను అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చింది. కాగా పత్రికా రంగంలో మాత్రం స్థానిక, స్థానికేతర గుర్తింపు ఇంకా జరుగలేదు. ఆంధ్రా పత్రికలలో అధికభాగం తెలంగాణ పత్రికలు గానే కొనసాగుతున్నాయి.. వాటిలో మెజారిటీ జర్నలిస్టులు, జర్నలిస్టేతరులు స్థానికేతరులే. తెలంగాణలో ఆంధ్రా పత్రికల ప్రాబల్యం వల్ల ఈ రాష్ట్రం ఎంతో నష్టపోతుంది.
ఱ ఆంధ్రాయాజమాన్యాల చేతుల్లోని పత్రికలు ఇక్కడి భాష, యాసలను నియంత్రిస్తున్నాయి. పరాయి భాషను, యాసను బలవంతంగా రుద్దుతున్నాయి.
ఱ తమకు కావలసిన విధంగా ప్రజల అభిప్రాయాన్ని మలుస్తున్నాయి. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుగుణంగానో, తమ ప్రయోజనాలకు అనుగుణంగానో ప్రజాభిప్రాయాన్ని మలిచే ప్రయత్నం చేస్తున్నాయి.
ఱ వాస్తవాలను కాలరాస్తున్నాయి. దశాబ్దాల తరబడి తెలంగాణకు జరిగిన అసమానతలను, అన్యాయాన్ని ఈ పత్రికలు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి.
ఱ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఱ జర్నలిజం విలువలు, ప్రమాణాలు పట్టించుకోవడమే లేదు.
ఱ జర్నలిజం ముసుగులో వందల ఎకరాల విలువైన భూములు కొల్లగొట్టారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రచురణలో లేని పత్రికలకు కూడా విలువైన భూములు ఇచ్చారు. అవి ఇంకా అలాగే• ఉన్నాయి.
ఱ ఈ పత్రికల ధోరణిని ఎవరు ప్రశ్నించినా వెంటనే వారికి పత్రికా స్వేచ్ఛ నినాదం గుర్తుకొస్తుంది. వాస్తవానికి ఈ పత్రికలకు పత్రికా స్వేచ్ఛ అంటే వాటి యాజమాన్యాల స్వేచ్ఛ అన్నమాట. వారికి రక్షణ కల్పించడం కోసమే పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నారు. నిజానికి పత్రికా స్వేచ్ఛ అంటే ప్రజలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ. కానీ ఆంధ్రా పత్రికల యాజమాన్యాల స్వేచ్ఛగా ఇది మారిపోయింది. ఈ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు మాత్రం ఎలాంటి స్వేచ్ఛ లేదు.
సొంత పత్రికలే పునర్నిర్మాణ సాధనాలు..
ముందే చెప్పుకున్నట్లు కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినప్పటికీ సమాచార రంగంలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. విధానాలలో మార్పు రాలేదు. ఆంధ్రా పత్రికలకు అంతే అపరిమితమైన ప్రాధాన్యత లభిస్తుంది. తెలంగాణ పత్రికలకు అసలు ప్రాధాన్యతే లేదు. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రంలో ఇంటి పార్టీ ఈ పరిస్థితిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర రంగాలలో పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. అనేక రాయితీలను ప్రకటిస్తోంది. ఆయా రంగాల అభివృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. ఉపాథి అవకాశాలు మెరుగవుతాయి. ఆయా రంగాలు స్వయం సమృద్ధిని సాధించడానికి ఉపకరిస్తాయి. ఇది సంతోషించదగిన పరిణామం. అయితే అదే తరహా ప్రోత్సాహం పత్రికా రంగంలోనూ ఇంటి పత్రికలకు, సొంత పత్రికలకు ఇవ్వాలి.
ఇపుడు జరగాల్సిందేమిటి?
తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణ సాధనలో పత్రికా రంగం క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందుకే సొంత పత్రికలను ప్రోత్సహించుకోవాలి. ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకోవలసి ఉంది. తెలంగాణ అస్తిత్వ, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యం నెరవేరడానికి గాను తెలంగాణ యాజమాన్యాల ఆధ్వర్యంలో పత్రికలు నిలదొక్కుకునే విధంగా, నూతన పత్రికలు వచ్చే విధంగా కృషి జరగాలి. ఇప్పుడున్న పత్రికలను ప్రోత్సహించాలి.
• అక్షర పెత్తనం అంతం కావాలి. అక్షర దాసోహం, అక్షర బానిసత్వం పోవాలి. అందుకు అవసరమైన కార్యాచరణ అమలు జరగాలి.
• సమాచార శాఖ బడ్జెట్‌లో స్థానిక పత్రికలకు కనీసం 30శాతం ప్రత్యేక కేటాయింపులుండాలి. తెలంగాణ పత్రికలకు అత్యధికంగా యాడ్స్ ఇచ్చే విధంగా నిబంధనలు ఉండాలి. అవి నిలదొక్కు కోవాలంటే ఇలాంటి చర్యలు తప్పవు.
• ముద్రణా యంత్రాలు, సామాగ్రి కొనుగోలుపై సుంకాల మినహాయింపు ఉండాలి.
• తెలంగాణ పత్రికలకు తక్కువ ధరకు స్థలాలు కేటాయించాలి.
• మీడియా జాబితాలో స్థానిక పత్రికలను చేర్చే విషయంలో నిబంధనల సడలింపులు వుండాలి.
• తమిళనాడు తరహాలో స్థానిక పత్రికలకు ప్రాధాన్యతా క్రమంలో ప్రోత్సాహకాలివ్వాలి.
• ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు (బస్‌పాస్‌లు, హెల్త్కార్డులు, అక్రిడేషన్లు, ఇళ్లస్థలాలు, పెన్షన్లు వంటివి) గ్రామీణ విలేకరులకు కూడా వర్తింపజేయాలి.
• పత్రికా నిర్వహణను వ్యాపారంగా భావించకుండా సామాజిక సేవా దృక్పధంగా భావించి ప్రచురణ కోసం వినియెగించే విద్యుత్‌లో కనీసం 50శాతం రిబేట్‌ను ఇస్తూ ప్రత్యేక కేటగిరీలుగా గుర్తించాలి. (ఈ సౌకర్యం ఉమ్మడి రాష్ట్రంలో ఉంది). మౌలిక సదుపాయాలైన భూమి కేటాయింపులో కనీస ధరను నిర్ణయించి జిల్లా కేంద్రాలలో ఒక్కో పత్రికకు అర్హతను బట్టి స్థలాలు కేటాయించాలి. హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రామీడియా యాజమాన్యాలు పత్రికల పేరుతో తీసుకున్న కోట్లాది రూపాయల విలువ చేసే భూములను వినియోగంలో లేనివాటిని వెనక్కి తీసుకోవాలి.
• జిల్లా, మండల, గ్రామ, తండాల వరకు తెలంగాణ దినపత్రికలు చేరేలా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ప్రత్యేక రాయితీతో రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. దీనివల్ల ప్రచురణకు డెడ్‌లైన్‌ అర్దరాత్రి వరకు ఉండి, తెల్లవారు జామునే మారుమూల గ్రామాలకు పత్రికలు చేరుకునే వీలుంటుంది.
• తెలంగాణ జిల్లాలలో స్థానిక పత్రికల స్థితిగతులు అధ్యయనం చేసి సొంత కాళ్లపై పత్రికా రంగం నిలబడేలా చేయడానికి లోతుగా పరిశీలించడానికి పత్రిక నిర్వాహణలో అనుభవం గల వారితో కలిపి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి, నిర్ణీత కాల గడువు విధించి సూచనలను స్వీకరించాలి.
• అధికార వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం జిల్లాలు, డివిజన్‌లు, మండలాల పునర్విభజన చేస్తోంది. అదే విధంగా పత్రికల విషయంలో కూడా ఆంధ్రా పత్రికల గుత్తాధిపత్యం తగ్గించడం కోసం వికేంద్రీకరణ జరగాలి. జిల్లాల స్థాయిలో పత్రికలు ముద్రించి శివారు గ్రామాలకు కూడా చేరేలా ప్రోత్సహించాలి.
• ఏ జిల్లాలో సేకరించే భూములకు సంబంధించిన భూసేకరణ ప్రకటనలు ఆ జిల్లాకు మాత్రమే పరిమితం చేయాలి. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతుంది. ఉదా : ఓ ప్రాజెక్టు కోసం మెదక్‌ జిల్లాలో భూ సేకరణ చేస్తుంటే దానికి సంబంధించిన పత్రికా ప్రకటనలు రాష్ట్రమంతా ఇవ్వడం దేనికి? ఒక్కో సందర్భంలో సేకరిస్తున్న భూమి కన్నా భూసేకరణ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతున్న సందర్భాలు ఉంటున్నాయి. రైతులకు ఇస్తున్న పరిహారం కన్నా భూసేకరణ ప్రకటనల కోసం పత్రికలకు ఎక్కువ చెల్లించడం న్యాయం కాదు కదా? ఇది ఎవరిని బాగుచేయడానికి? తెలంగాణ సంపద అంతా కూడా పరాయి రాష్ట్రాల యాజమాన్యాలకు పోతుంది. అందుకే ఈ ప్రకటనలను జిల్లాలకు పరిమితం చేయాలి.
• బంగారు తెలంగాణ నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించేలా జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాలి. తెలంగాణలో ఒక బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని, స్వరాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు, అభ్యున్నతికి ఉపయోగపడే జర్నలిజాన్ని అభివృద్ది చేసి వ్యాప్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
• స్వీయ అస్తిత్వ పరిరక్షణకు కార్యాచరణ అమలు చేయాలి.
• అవుట్‌డోర్‌ పబ్లిసిటీ, పోస్టర్‌ ప్రింటింగ్‌ వంటివన్నీ ఆంధ్రా మీడియానే చేస్తోంది. అంటే ఆదాయ వనరులన్నీ మొత్తం అటే పోతున్నాయి. వీటిపై దృష్టిపెట్టాలి.
• నీతి, నిజాయితీ, నిబద్దతతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేసే స్థానిక పత్రికలు అవసరం. ఇది భూమి పుత్రులతోనే సాధ్యం. భూమి పుత్రుల యాజమాన్యంలోనే పత్రికలు రావాలి. ఇక్కడి అసమానతలు, అన్యాయాలు, సమస్యలపై ఇక్కడి పత్రికలకు ఉండే ఆందోళన ఆంధ్రా మీడియాకు ఎలా ఉంటుంది?
• తెలంగాణ సమాజానికి తనదైన సొంత గొంతు కావాలి. తెలంగాణ ప్రజలకు తమ వాణి వినిపించే గొంతు ఉండాలి. పరాయిగొంతుతో తెలంగాణ సమాజం ఎంతకాలం యాంకరింగ్‌ చేయించుకోవాలి?
ఆంధ్రా పత్రికలకు కొన్ని ప్రశ్నలు…
ఇతరులకు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే. కానీ ఆ ముసుగులో ఇతరుల వ్యక్తిగత, సమూహం లేదా సమాజానికి సంబంధించిన చట్టపరమైన ప్రయోజనాలను దెబ్బతీసే అధికారం, హక్కు ఎవరికీ లేదు. కానీ ఈ అంశాన్ని ఆంధ్రా పత్రికలు ఏనాడూ గౌరవించలేదు.
• ఇపుడు ఉన్న పత్రికలు ఆంధ్రా కోణంలోనే ఆలోచిస్తాయి. ఆంధ్రా ప్రజల ప్రయోజనాల కోణంలోనే పనిచేస్తున్నాయి. ఖమ్మం ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని ఆంధ్రా పత్రికలు వ్యతిరేకించగలవా? అలా వ్యతిరేకిస్తే ఆంధ్రాలో కూడా ఆ వార్తలను హైలైట్‌ చేస్తూ ప్రచురించగలవా?
• పాలమూరు ఎత్తిపోతలు, డిండి తదితర తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ పత్రికలు సంపాదకీయం రాయగలవా? దానిని ఆంధ్రా ఎడిషన్లలో ప్రచురించగలవా?
• చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణికి ఈ పత్రికల పోకడలకు తేడా ఏముంది?
• ఆంధ్రా పార్టీలను ఇక్కడి ప్రజలు, నాయకత్వం, మేధోసంపత్తి నిర్వీర్యం చేయగలిగాయి. కానీ వాటి మూలాలు, వాటి గొంతుకలైన ఆంధ్రా పత్రికలు, మీడియా ఇక్కడ వివిధ రూపాలలో విషం కక్కుతూనే ఉన్నాయి.
• ఏనాడైనా ఈ పత్రికలు తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమయ్యాయా? అన్ని రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రజల పక్షాన ఆలోచించాయా..?
• తెలంగాణ ఉద్యమానికి ముందు ఇక్కడి బతుకమ్మను, బోనాలను, జాతరలను గుర్తించాయా.?
• సినిమాలలో తెలంగాణ భాషను, యాసను, గూండా, పనిమనుషుల క్యారెక్టర్లకు అపాదించి వారిని ఆంధ్రా హీరోలతో తన్నిస్తుంటారు. ఇదేం అన్యాయం అని ఏనాడన్నా ఈ పత్రికలు ప్రశ్నించాయా? తెలంగాణ బాషను అపహస్యం చేయడాన్ని నిలదీశాయా.?
• ఆరు సూత్రాల పథకం అడుగడుగునా దగాకు గురై తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నష్టపోతే అందుకు కారణమైన ఆంధ్రా పాలకులను ఈ పత్రికలు ఎప్పుడైనా ప్రశ్నించాయా?
• వివిధ రంగాలలో తెలంగాణ నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలు లూటీ అవుతుంటే అందుకు కారకులైన ఆంధ్రా పాలకులను నిలదీశాయా?
• తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోపిడీకి గురవుతుంటే ఏనాడైనా వ్యతిరేకించాయా?
• తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే హరీశ్‌రావును నిండు సభలో ఈసడిస్తే ఏ ఆంధ్రా పత్రికైనా ఖండిస్తూ సంపాదకీయం రాసిందా? బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాల ప్రజలను సమాన దృష్టితో చూడాల్సి ఉన్నా, సభలో తోటి శాసనసభ్యుడిని గౌరవించాల్సి ఉన్నా అన్నిటినీ మించి అప్రజాస్వామికంగా మాట్లాడినా ఆంధ్రా పత్రికలు ఎందుకు ప్రశ్నించలేక పోయాయి?
• వెనుక బాటుతనం పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు, రాయితీలు ఆంధ్రా పెట్టుబడిదారుల స్వాధీనం అవుతుంటే ఏ పత్రికైనా బయట పెట్టిందా?
• తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టులు, భూములు అక్రమంగా ఆంధ్రా పెట్టుబడిదారులు కాజేస్తుంటే ఏ పత్రికన్నా వ్యతిరేకించిందా? కావూరిసాంబశివరావు, ల్యాంకో రాజగోపాల్‌ వంటివారు తెలంగాణ ప్రాంతంలో చేసిన కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు. ఏ పత్రికైనా వాటిని ప్రశ్నించిందా?
• ఆంధ్రా కార్పొరేట్‌ విద్యాసంస్థలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఫీజుల పేరిట దోపిడీ చేస్తుంటే ఏ hvh రాసిందా?
• ఏ ఇంటి పక్షి ఆ ఇంటి పాట పాడుతుందన్నట్లుగా స్వభావ రీత్యా ఆంధ్రా పత్రికలు ఆంధ్రా ప్రాంత ప్రయోజనాలకోసం, స్వప్రయోజనాల కోసం పనిచేస్తాయే తప్ప జర్నలిజం ప్రమాణాలు విలువల కోసమో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమో పనిచేస్తాయని ఆశించడం నేతి బీరకాయలో నేయి, మేక మెడ సన్నులలో పాలు ఉంటాయని ఆశించడమే అవుతుంది.
• పాముకు పాలుపోసి పెంచినట్లు పరాయి గొంతులను ఎంతకాలం పెంచుదాం?
అందుకే తెలంగాణ పునర్నిర్మాణానికి ఇంటిపార్టీ లాగా సొంత పత్రికలు రావలసిన అవసరం ఉంnది. ఉన్న పత్రికలను చానెల్స్ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ విషయంపై ప్రతీ తెలంగాణ బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

నోట్ : ఈ అంశాలన్నీ తెలంగాణ పత్రికలు-ఆవశ్యకత అనే పుస్తకంలోనివి..

ఈ వ్యాసం మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ రచించిన తెలంగాణ చిన్న పత్రికలు పుస్తకం లోనిది..r

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *