
“తర తరాల బంధం
కలిపిన పెద్దన్న
కాలంలో కలిసి పోతుంది
హద్దులు చెరిపి
మనుషుల నొక్కటి చేసిన
మానవతా మూర్తి
మరుగున పడిపోతుంది.
రాష్ట్రాల దాకా రవాణాకు
నేనున్నా భరోసా
అంటు వెన్నుముకై అందిన దధీచి
1956 లోపుట్టి 2016 దాకానిలిచి
అరవయ్యేళ్ళ అద్బుత సేవతో
షష్టిపూర్తి చేసుకున్న
పూర్ణాయుష్కుడు
ఎన్నోసార్లు వరదల ఆటుపోట్లకు జడవక
గోదారి పొంగుల్లకు
ఎదురునిలిచిన
మహాశివుడు
భారత దేశానికి
రామసేతు ఎంత గొప్పదో
కరీంనగర్ అదిలాబాద్
జిల్లాలకు
రాయపట్నం బ్రిడ్జ్
అంత గొప్పది
ఇన్నాళ్ళు జనాల్ని
గంగ దాటించిన
ఈ గుహుడు
తన వారసున్ని
సమున్నతంగా నిలిపి
పదవీ విరమణతో
పాతాళానికి చేరుకుంటుండు
ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లో కాదు
మన కృతజ్ఞతా కన్నీళ్ళతో
అభిషేకం చేసి
బ్రిడ్జ్ సేవకు సెలవిద్దాం.
మానవ సమాజంతో
జీవాలే కాదు
కాంక్రిట్ కట్టడాలూ
మమతల అనుబంధాలను
జీవితమంతా గాడంగా
పెనేసుకుంటాయి.”