
అప్పట్లో వైఎస్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరుతో తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇవి మధ్యతరగతి ప్రజలకు రాయితీతో ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. కానీ నిర్మాణ పనుల్లో జాప్యం, కొందరు డబ్బులు కట్టి వీటిని తీసుకోకపోవడం జరిగింది. దీంతో ఇలా తెలంగాణ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండ్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఆ ఇండ్లను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ అమ్మకానికి పెట్టింది.
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10వేల ఇళ్లు/ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. దీనికి ధరలు సైతం ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చదరపు అడుగుకు రూ.2200 నుంచి 2800 వరకు ధరను నిర్ణయించింది.
హైదరాబాద్ లోని నాగోల్-బండ్లగూడలో , పోచారం ఈ వేలం పద్ధతి ప్రభుత్వం ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది. ఇందులో బండ్లగూడలో 2200 ప్లాట్లు, పోరారంలో 2600 ప్లాట్లు ఉన్నాయి. ఇవేకాకుండా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, గద్వాల, కామారెడ్డిలలో సైతం ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.