
వానమ్మా ఇటు రామమ్మా అంటూ రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లు వరుసగా కరువు మిగిల్చిన విషాదం రైతుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు, రైతులు అందరూ కాలం కావాలని వెయ్యినొక్క పూజలు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటివారంలోనే తెలంగాణ వరకు వచ్చి మరీ బంగాళా ఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్ వయా వెళ్లి పోయాయి. కానీ తెలంగాణలో వరుణుడి జాడ లేదు.
ఇటు తెలంగాణలో వానల కోసం కప్పతల్లి ఆటలు, కోతులు, గాడిదలు, కుక్కలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. శివాలయాల్లో లింగాలకు నూట 16 బిందెలతో జలాభిషేకాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలుడు వానల కోసం ఏకంగా మోకాళ్లతో వాగు వద్దకు చేరుకొని పూజలు ఇలా చేశారు.
రెండేళ్లు కరువు మిగిల్చిన విషాదం కళ్లముందే మెదులుతోంది. ఇప్పటికే అన్ని బావుల్లో, బోరుల్లో నీరు అడుగంటి జనం హాహాకారాలు చేస్తున్నారు. ఈసారి వానలు పడకుంటే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. అందుకే వానమ్మా ఇటు రావమ్మా అంటూ జనం వానలు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు..