చట్టం చంద్రబాబు చుట్టం అయిపోయింది..

chandrababu-2

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో తనపై విచారణ జరపవద్దని కోరుతూ హైకోర్టుకు వెళ్లారు. స్టే కూడా లభించింది. ప్రతివాదులు తెలంగాణ ఎసిబి,మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కౌంటర్ వేసే వరకు ఈ స్టే వర్తిస్తుందని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఊహించిన పరిణామమే. హైకోర్టుకు వెళ్లే హక్కు చంద్రబాబుకు ఉంది.దానిని ఎవరూ కాదనలేరు.కాకపోతే విపక్షం ఆయనపై విమర్శలు కురిపించడానికి ఆయన అవకాశం ఇచ్చారు.తను తప్పు చేసినట్లు చంద్రబాబు ఒప్పుకుంటున్నారని, అందుకే కనీసం విచారణ కూడా జరగకుండా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారన్నది వారి ఆరోపణగా ఉంది.అయినా చంద్రబాబు కు హైకోర్టుకు వెళ్లే హక్కు ఉందని అంగీకరించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ సమస్యపైన అయినా కోర్టుకు వెళ్లవచ్చు.కోర్టుకు వెళ్లడాన్ని చంద్రబాబు గతంలో తనకు ఇష్టం లేనివారిని ఉద్దేశించి ఉన్మాదం అన్నారు కనుక మనం కూడా అలా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేపు లో దొరికిపోవడం తోనే ఈ సమస్య అంతా వచ్చింది. చంద్రబాబు అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు తీసుకుంది. హైకోర్టు కు సమర్పించిన పిటిషన్ లో విపక్ష ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై ఎసిబి కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అలాగే మత్తయ్య పై కేసును హైకోర్టు కొట్టివేసిందని, దానిపై తెలంగాణ ఎసిబి అప్పీల్ కు వెళ్లిందని ,అది పెండింగులో ఉండగా , ఈ కేసు ఎలా విచారణ సాగిస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.పైగా ఇది అసలు ఎసిబి కేసు కాదని, ఎన్నికల అక్రమం కనుక ఎన్నికల సంఘం చేపట్టవలసిన కేసు అని కూడా వాదన చేశారట.ఈ వాదనలన్ని వింటే ఏమని అర్ధం అవుతుంది.తప్పు జరిగింది కాని, తమ జోలికి ఎసిబి రావడానికి వీలు లేదని చెప్పడమే కదా! నిజానికి చంద్రబాబు ఇంతగా భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఆయన అన్ని విదాల జాగ్రత్త పడడానికి ఈ పిటిషన్ వేసినట్లు కనబడుతుంది.

ఓటుకు నోటు కేసు చార్జీషీట్ లో ముప్పై మూడు సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన తెచ్చినా, తెలంగాణ ఎసిబి ఆయన పేరును ఎఫ్ ఐ ఆర్ లో చేర్చలేదు. ఆయనపై తదుపరి విచారణ చేపట్టలేదు. ఇప్పుడు కూడా నేరుగా ఎప్ ఐ ఆర్ లో చేర్చకుండా పాత ఎఫ్ ఐ ఆర్ ఆదారంగానే కేసు విచారణ కొనసాగించి నివేదిక ఇస్తామని తెలంగాణ ఎసిబి తెలిపింది.ఇది ఎటూ రాజకీయంగా కూడా ప్రభావం చూపే అంశం కనుక తెలంగాణ ఎసిబి నేరుగా చంద్రబాబు పై కేసు పెడుతుందన్న గ్యారంటీ కనబడడం లేదు. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కెసిఆర్,చంద్రబాబులు రాజీపడ్డారని, దానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు మద్యవర్తిత్వం చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాకపోతే వైసిపి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ తో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.అంతమాత్రాన ఎసిబి గతంలో ఎలా వ్యవహరించినా, ఇప్పుడు చంద్రబాబు కు వ్యతిరేకంగా నివేదిక ఇస్తుందా అన్నది సందేహంగానే ఉంది.అయినా చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఇలాంటి విషయాలలో ఆయన ఎక్కడా దొరకకుండా ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకుంటారు. అందువల్లే ఈ కేసు ను ముందుగా కనిపెట్టడం లో ఎపి నిఘా అదికారులు విఫలం అయ్యారని ఆయన
మండిపడుతున్నారట. నిజమే నిఘా వ్యవస్థలు,పోలీసు వ్యవస్థలు ఉన్నది మన ఏలికలు చేసే వ్యవహారాలకు రక్షణగా ఉండడమే కదా! చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే సంచలనం అయ్యేది. అలా జరగలేదు కనుక ఇది ఊహించిందే కదా అని అంతా వ్యాఖ్యానించడానికి ఆస్కారం ఏర్పడింది.చట్టం ఈ కేసులో ముఖ్యమంత్రి ని నిలదీయగలుగుతుందా?లేదా అన్నదే అసలు ప్రశ్న.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *