
నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కాశ్మీర్ లోయలో పరిస్థితి ఒక్కసారిగా మారింది. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత వేర్పాటువాదుల నుంచి నిరసనకారులకు వచ్చే డబ్బు ఆగిందని, దీంతో ఏ యువకుడూ హింసకు దిగలేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైతం చెబుతున్నారు. “ఇంతకుముందు భద్రతా దళాలపై రాళ్లు రువ్వితే రూ. 500, అంతకుమించి ఇంకేదైనా చేస్తే రూ. 1000 ఇచ్చేవాళ్లు. అయితే మోదీ ఉగ్ర నిధుల విలువను శూన్యం చేశారు” అని పారికర్ చెప్పారు. ఆర్థిక భద్రత కోసం మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో కాశ్మీర్ లో పరిస్థితి చక్కబడిందని ఆయన వివరించారు.
కాగా, వేర్పాటువాదుల వద్ద కొత్త కరెన్సీ లేకపోడవంతో వారి నుంచి నిరసనకారులకు ఏ విధమైన ధన సాయం అందడం లేదు. దీంతో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు యువత నిరాసక్తంగా ఉన్నారని తెలుస్తోంది. పాత నోట్లు ఇస్తామని వేర్పాటు వాదులు చెబుతున్నా, అవి వద్దని నిరసనకారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కాశ్మీర్ లో కనిపిస్తోంది. ఇక దీన్ని అనుకూలంగా మలచుకుని లోయలో తిరిగి సాధారణ జీవనాన్ని ప్రజలు కొనసాగించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హిజ్జుల్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ తర్వాత కొన్ని నెలలుగా కాశ్మీర్ రావణకాష్టంలా రగిలిపోయిన సంగతి తెలిసిందే.
పాత పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అయితే నగదు మార్పిడికి, చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మోదీ అనాలోచితన నిర్ణయం తీసుకున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణం నెలకొనడం చూస్తుంటే.. మోదీ తీసుకున్న నిర్ణయం తప్పుకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.