
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అలహాబాద్‌లో పెళ్లి బాజా మోగింది. అన్ని పత్రాలు సమర్పించి బ్యాంక్ నుంచి రూ. 2.5 లక్షలు డ్రా చేసి.. సంతోషం వ్యక్తం చేశారు. మోదీ నిర్ణయంతో తమ కెంతో మేలు జరిగిందని సునీల్ అనే పెళ్లి కొడుకు అన్నారు. తమ ఇంట్లో మూడు పెళ్లిళ్లకు ఇబ్బంది తొలగిందని, ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు చాలా మంచి జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో పెళ్లిళ్లకు ఇబ్బందులు కలగడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. కాగా నోట్ల మార్పిడి పరిమితిని పెంచుతూ కొంత వెసులుబాటు కల్పించిన కేంద్రం, ఆ నిర్ణయాన్నిఒక్క రోజులోనే ఉపసంహరించుకుంది. బ్యాంకుల్లో నోట్లమార్పిడి పరిమితిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నోట్ల మార్పిడి రూ.4వేల నుంచి రూ.2వేలకు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ ప్రకటించారు. రేపటి (శుక్రవారం) నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. దీంతో రేపటి నుంచి ఖాతాదారుడు నోట్లమార్పిడి ద్వారా రూ.2వేలు మాత్రమే పొందనున్నాడు. అయితే శక్తికాంతదాస్ మరో ప్రకటన చేశారు. రైతులు, వ్యాపారులకు విత్‌డ్రా చేసుకునే నగదును పెంచింది. రైతులు వారానికి రూ.25 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని, ఏపీఎంసీ వ్యాపారులు వారానికి రూ.50 వేలు తీసుకోవచ్చని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సీ ఉద్యోగులకు 10వేల అడ్వాన్స్, పంటల బీమా ప్రీమియం గడువు 15 రోజులు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు.