
నల్లకుబేరుల సొమ్మంతా దేశానిదే అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గోవాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నల్లధనంపై యుద్ధం కొనసాగుతుందన్నారు. బినామీ ఆస్తులపై దాడులు నిర్వహిస్తామని చెప్పిన ప్రధాని ఎన్నికల సమయంలో నల్లధనంపై పోరాటం చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. ఇంతకుముందు చూసిన మోడీ వేరు ఇకపై చూడబోయే మోడీ వేరు అని చెప్పారు. దేశం కోసం తన కుటుంబాన్నే వదులుకున్నట్లు ఉద్వేగంతో అన్నారు ప్రధాని.
డిసెంబర్ 30 వరకు సమయమివ్వాలని చెప్పిన ప్రధాని ఆ తర్వాత కూడా తన నిర్ణయం తప్పనిపిస్తే దేశప్రజలు ఏశిక్ష వేసినా అందుకు సిద్ధమేనంటూ తెలిపారు. నవంబర్ 8 రాత్రి 8 గంటలనుంచి దేశంలో మార్పు మొదలైందన్నారు. ఎప్పుడూ విదేశాల్లో మోడీ పర్యటిస్తున్నారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు ప్రధాని.విదేశాల్లో పర్యటించడం వల్లే గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు తెలుసుకోగలిగాని సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవినీతి సామ్రాజ్యాలు కుప్పకూలాయన్నారు.
పెద్ద నోట్లపై రద్దు నిర్ణయం తీసుకోవద్దని యాభై శాతానికి పైగా ఎంపీలు కోరారు. కానీ పేదప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు మోడీ చెప్పారు. నల్లధనం ఎక్కడుందో సుప్రీం కోర్టు నిపుణుల సహాయంతో తెలుసుకున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను సవరించేందుకు చిన్న చిన్న మందులు ఇస్తూ వచ్చానని తెలిపిన మోడీ.. ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం పదినెలల పాటు కష్టపడ్డట్లు చెప్పారు. పదవికోసం తాను ఏనాడు పాకులాడలేదని మోడీ ఉద్ఘాటించారు.
70 ఏళ్లుగా దోచుకున్న సొమ్మును ఒక్కసారిగా బయటపెడాతానని చెప్పగానే చాలామంది నల్లకుబేరులు తనపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పిన మోడీ .. తనను అంతమొందించేందుకు కూడా ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయని అయినా భయపడేది లేదంటూ చెప్పారు. పెద్ద స్కాములు చేసిన వారు తాను తీసుకున్న నిర్ణయంతో రూ.4వేల కోసం క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. 50 రోజుల తర్వాత నవభారతాన్ని చూస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన మోడీ..సామాన్యులు ఓర్పుతో క్యూలైన్లలో నిలబడి డబ్బులు మార్చుకుంటున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.