‘నవ యవ్వన ఉద్యమ వీరుడు’ కే.శ్రీనివాసరెడ్డి

ఆయన పేరు ప్రస్తావనకు రానిదే ‘పాత్రికేయ ఉద్యమ చరిత్ర’కు ముగింపు లేదు. ఇప్పుడంటే పుట్టగొడుగుల్లా పాత్రికేయ సంఘాలు పుట్టుకువచ్చాయి గానీ, అప్పట్లో ఆయన నాయకత్వమే పాత్రికేయ ప్రపంచానికి ‘శ్రీరామరక్ష’లా ఉండేది. కేవలం పదవుల కోసమే ఆయన్ని వ్యతిరేకించిన వారు ఉండవచ్చు గానీ, ‘పని’లో ఆయన మాట జవదాటేవారు లేరనే చెప్పాలి.

పాత్రికేయుల హక్కుల పరిరక్షణలో కానివ్వండి, వారి సమస్యల పరిష్కారంలో కానివ్వండి, వృత్తిపరంగా వారికి రక్షణగా నిలవడంలో కానివ్వండీ ఆయన్ని మించిన మేథావి లేరనడంలో సందేహంలేదు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ’ ఆవిర్భావం ఆయన కృషి ఫలితమే. ‘క్యాబినెట్ హోదా’తో అకాడమీకి తొలి చైర్మన్‌ పదవిని అలంకరించిందీ ఆయనే.

స్వయం ప్రతిపత్తికలిగిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి సభ్యునిగా, భారతదేశంలో అత్యధిక సభ్యులు కలిగిన ‘ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్’ (ఐజేయూ)కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించి దేశవ్యాప్తంగా పాత్రికేయులకు సుపరిచితులైన ఆయన మరెవరో కాదు… ఆయనే మన ప్రియతమ నేత కె.శ్రీనివాసరెడ్డి గారు.

ఆయన సమకాలికులు ముద్దుగా పిలుచుకునే ‘కేఎస్సార్’ పుట్టినరోజు నేడు. 1950 సెప్టెంబర్ 7న జన్మించిన శ్రీనివాసరెడ్డి అత్యుత్తమ వామపక్ష భావాలు కలిగిన పాత్రికేయ ఉద్యమ నాయకునిగా గుర్తింపుతెచ్చుకోవడం మన అందరి గర్వకారణం. అటువంటి ‘ప్రభావశీలి’ నాయకత్వం, పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) పాత్రికేయుల హక్కులు, సంక్షేమం విషయాల్లో సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

యాజమాన్యాల సిఫార్సులతో నిమిత్తం లేకుండా కూడా ఇవాళ చాలా వరకు జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డులు పొందగలుగుతున్నారంటే అది శ్రీనివాసరెడ్డి గారి కృషి ఫలితమేనని చెప్పాలి. ‘గుర్తింపు కార్డు పత్రికకో, యాజమాన్యానికో ఇస్తున్నది కాదు. పాత్రికేయునికి ఇస్తున్నది’ అని జాతీయ, రాష్ట్రస్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలలో ఆయన వెల్లడించిన అభిప్రాయం మేరకే (జీవోలో మార్పు లేకపోయినా) నిబంధనలను సరళతరం చేశారన్నది చాలా మందికి తెలియని విషయం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ‘విశాలాంధ్ర’ రెసిడెంట్ ఎడిటర్‌గా, రాష్ఠ్ర విభజన తర్వాత ఏర్పాటైన ‘మన తెలంగాణ’కు ఎడిటర్‌గా కేఎస్సార్ పనిచేస్తూనే వర్ధమాన జర్నలిస్టుల వృత్తినైపుణ్యాన్ని పెంపొందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రెస్ అకాడమీకి సమాంతరంగా ‘పునశ్చరణ తరగతులు’ నిర్వహించే స్థాయిలో శ్రీనివాసరెడ్డి గారి సారధ్యంలోని సంస్థ పనిచేస్తోందని చెప్పుకోవడానికి మనమంతా గర్వపడుతున్నాం.

పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యంగా, వారి సమస్యలపై పోరాటమే ఆశయంగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు సరిగ్గా నేటితో 65 ఏళ్లు పూర్తిచేసుకుని 66వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.

మా ‘నవ యవ్వన ఉద్యమ వీరుడు’ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *