కేసీయార్ ప్రసంగానికి ప్రధాని మోడీ ఫ్లాట్ !!*

ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పాలకుడిగా కేసీయార్ పై భిన్నాభిప్రాయాలుండొచ్చు… కానీ ఒక వక్తగా కేసీయార్ గొప్పతనాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా మెచ్చుకుని తీరతారు… జనాన్ని మెస్మరైజ్ చేయడంలో నంబర్ వన్… దాన్ని ప్రత్యక్షంగా గమనించాడు మోడీ మొదటిసారి… నిజానికి మోడీయే మంచి వక్త… అలాంటిది కేసీయార్ ప్రసంగం తీరు చూసి ఫ్లాట్ అయిపోయాడు మోడీ… కేసీయార్ కు ఎదుటివాడిని ప్లీజ్ చేయడం ఎలాగో కూడా బాగా తెలుసు… ప్రధానికి బాగా బాగా నచ్చే అంశాలను కేసీయార్ ఎలా మాట్లాడాడో చూద్దాం…

కేంద్ర మంత్రులకు, ప్రధానికి అనువాదాల సమస్య అవసరం లేకుండా, కేసీయార్ తనే హిందీలో మాట్లాడాడు… అది మోడీకి నచ్చిన మొదటి కారణం… ఎందుకంటే పదే పదే వెంకయ్య వైపు వంగి, గుసగుసగా ‘‘కేసీయార్ ఏమన్నాడు, ఏమంటున్నాడు, ఏం అడుగుతున్నాడు’’ తెలుసుకునే అగత్యం లేకుండా పోయింది…

‘‘నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను… కానీ నేను మొదటిసారి ఢిల్లీలో అవినీతిరహిత కేంద్ర పాలనను ప్రత్యక్షంగా చూస్తున్నాను… దీనికి మోడీయే కారణం… ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేశప్రజలు గుర్తిస్తున్నారు…’’ అన్నాడు కేసీయార్…

నిజానికి తన పాలనను మిత్రపక్షమూ కాని, తన భాగస్వామి కూడా కాని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసిస్తుంటే… మోడీ ఫుల్ ఖుష్ కావడంలో ఆశ్చర్యమేముంది?

పొరుగునే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు చూసినా అది కావాలి, ఇది కావాలి అంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటాడు… ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ తన తలకు ఏపీరాజకీయాలు రుద్దుతాడు… తన రక్తం మరిగిపోతుందంటూ ఏపీ ప్రజలను బీజేపీకి వ్యతిరేకులను చేస్తాడు… తనను మించి విదేశీ పర్యటనలు చేస్తూ తనే ప్రధానిలా బిహేవ్ చేస్తుంటాడు… ఇదంతా మోడీకి తెలుసు… కానీ కేసీయార్ పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం మోడీకి భలే నచ్చినట్టుంది…

ఎందుకంటే… ‘‘కేంద్రానికి ఉన్న పరిమితులు నాకు తెలుసు, మీరు కూడా ముఖ్యమంత్రిగా చేసినవాళ్లే కాబట్టి ఒక రాష్ట్రం కేంద్రం నుంచి ఎలాంటి సాయం కోరుతుందో మీకు బాగా తెలుసు… నేను రాష్ట్రానికి యాభై వేల కోట్లు ఇవ్వు, లక్ష కోట్లు ఇవ్వు అంటూ అడగను… ఒక ప్రధానిగా ఈ రాష్ట్రంపై మీ ఆశీస్సులు ఉంచండి, మీ ప్రేమ పంచండి… అవసరమున్నప్పుడు కావల్సిన పని చేసిపెట్టండి’’ అంటూ కేసీయార్ మాట్లాడుతుంటే… అందరూ చంద్రబాబు, కేసీయార్ ల నడుమ ఉన్న తేడా ఏమిటో చెప్పుకోవడం మొదలెట్టారు…

ఏదో మొక్కుబడిగా, మీరు వచ్చారు, మాకు సంతోషం, ఇక వెళ్లరండి అన్నట్టు పుల్లవిరుపు మాటలు గాకుండా… ఏయే అంశాల్లో తెలంగాణకు కేంద్ర మంత్రులు ఎలా సహకరిస్తున్నారో సవివరంగా వేదికపైనే చెబుతూ అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పడం కూడా మోడీకి భలే నచ్చి ఉంటుంది… తన సహచర మంత్రులను ప్రశంసించడం తనకు ఆనందమే కదా… విద్యుత్తు విషయంలో పీయూష్, రహదారుల విషయంలో నితిన్ గడ్కరీ, రైల్వే లైన్ విషయంలో సురేష్ ప్రభు, మిగతా అన్నివిషయాల్లో వెంకయ్యనాయుడు సహకరించిన తీరును కేసీయార్ అంకెలతో సహా వివరించాడు…

‘‘నేను నా చిన్నప్పటి నుంచీ కేవలం వింటూనే ఉన్నాను… హైదరాబాద్- కరీంనగర్ రైలు అనేది ఏనాటి నుంచో మా కలల్లో ఉన్నది… ఇప్పుడది మీ చొరవ వల్ల సాధ్యమవుతున్నది’’ అనే ప్రస్తావన… ‘‘17 ఏళ్లుగా మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మీ సాయం వల్లే పునరుద్ధరణకు నోచుకుంటున్నది’’ అనే వివరణ… ఒక్క మోడీనే కాదు, ప్రజలను కూడా బాగా ఆకర్షించాయి… నిజానికి ఈ రెండూ కేసీయార్ గొప్పగా చెప్పుకోగలిగే పనులే… ఈ సహకారానికి ప్రధానికి, కేంద్రానికి ప్రజాముఖంగానే థ్యాంక్స్ చెప్పుకోవడం బాగుంది…

తన మొత్తం ప్రసంగంలో కేసీయార్ ఒక్కటంటే ఒక్క మాటలో కూడా పొలిటికల్ మైలేజీ కోసం తాపత్రయపడకపోవడం… ఎక్కడా స్వోత్కర్ష లేకపోవడం… రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురాకపోవడం… వ్యక్తిగత ప్రచారలబ్ధికి ప్రయత్నించకపోవడం బాగుంది… ఒక ప్రధాని వచ్చాడు, కొన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు, ఒక ముఖ్యమంత్రిగా తను చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నాడు… అంతే… ప్యూర్ గా ఒక ఫెడరల్ సిస్టంలో ఓ నిర్ణీత సంప్రదాయాలు, ఆనవాయితీల పరిమితుల్లో సాగిన సభ అది…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *