పత్రికలపై కేసీఆర్ వైఖరి మారాల్సిందే..

– స్థానిక పత్రికల బలోపేతానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం.
– కేసీఆర్‌ బలంగా ఉన్నంత వరకు ఏ పత్రికా ఎదిరించదు… -అనంతరం‘నమస్తే’ ఒక్కటి మాత్రమే సరిపోదు.
– తెలంగాణ పత్రికలకు ఔట్‌రైట్‌ ప్రోత్సాహం అవసరం.

కేసీఆర్‌ దేశంలోనే నవంబర్‌వన్‌ సీఎం, కేసీఆర్‌ డైనమిక్‌ లీడర్‌…‘నో డౌట్‌’ ఇది ముమ్మాటికీ నిజం. పకడ్భందీ వ్యూహం, సకాలంలో సముచిత ఎత్తుగడలతో ప్రత్యర్థిని ఉక్కిరి,బిక్కిరి చేసి తాననుకున్నది సాధించడంలో ఆరితేరిన నేర్పరి.
సమాచారశాఖకు స్వయంగా తానే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో చాపకిందనీరులా ప్రవహిస్తున్న ఆంధ్రామీడియా ఏనాడైనా తన నైజాన్ని ప్రదర్శిస్తుందని తెలియదా? అంటే ఖచ్చితంగా తెలుసు. ఓటుకు నోటు వ్యవహారం, మల్లన్న సాగర్‌ అంశం, చివరికి హైదరాబాద్‌లో వరదలు ఇలా ప్రతిసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సంఘటనలను ఆంధ్రా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా భూతద్దంలో పెట్టి మరీ ఎత్తిచూపిస్తున్నాయి.
రాజు బలవంతుడిగా ఉన్నంతకాలం కుట్రదారులు నోరు మెదపరు. తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. రాజు బలం తగ్గినా? ప్రత్యర్థి పుంజుకున్నా అదనుకోసం పొంచిఉన్న వ్యక్తులు తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇవన్ని కేసీఆర్‌కు తెలియనివికాదు. మరో రెండేళ్లలో ఎన్నికల జ్వరం మొదలవుతుందని తెలుసు, ఆంధ్రా పత్రికలు తమ నైజాన్ని పునఃప్రదర్శిస్తాయని తెలుసు. మరి స్థానిక పత్రికలను నిర్ద్వంధంగా ఎందుకు ప్రోత్సహించడం లేదనేదే జవాబు చిక్కని ప్రశ్న. ఇది ప్రత్యక్షంగా ఉద్యమ పార్టీకి బలం ఉన్నంతవరకు నష్టం చేకూర్చ లేకపోయినా తెలంగాణ సమాజానికి మాత్రం తీరని నష్టం.
ప్రభుత్వం అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించినట్టు 538కోట్లు ప్రచారానికి వెచ్చించింది. అందులో నమస్తే తెలంగాణతో పాటు కమ్యూనిస్టు పత్రికలు, మన తెలంగాణ,నవతెలంగాణతో పాటు మెట్రోఈవినింగ్స్, జనంసాక్షి లాంటి తెలంగాణ పత్రికలకు 18శాతం నిధులు పోగా, మిగతా 82శాతం అంటే 414 కోట్లు ఆంధ్రామీడియాకే లాభాన్ని చేకూర్చాయన్నది పచ్చినిజం. తెలంగాణ ప్రజలు పన్నుల రూపేణ చెల్లిస్తున్న ఈ డబ్బును సొమ్ముచేసుకొంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి,సాక్షి,ఆంధప్రభ, సూర్య లాంటి పత్రికలు తెలంగాణకు మనస్ఫూర్తిగా మద్దతునిస్తాయా అంటే.. గ్యారంటీ లేదు. పరాయి యాజమాన్యంలోని పత్రికలు ‘పరాయి పత్రికలే’ అన్న అంశాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాల్సిన సలహాదారు వ్యవస్థ,పీఆర్వోవ్యవస్థలు నిర్వీర్యమయ్యాయనే చెప్పాలి.
దినపత్రికలను, మ్యాగజైన్లను క్రమబద్దీకరించే నేపథ్యంలో ఆంధ్రా,తెలంగాణ యాజమాన్యాలను ఒకే గాటికి కట్టడంతో స్వతహాగా గత ఉమ్మడి రాష్ట్ర పాలనలో కోట్లు దిగమింగిన ఆంధ్ర పత్రికలే ముందువరుసలో నిలబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ నెం.84, 239లో పరిశీలిస్తే ఈవిషయం స్పష్టమవుతుంది.

అక్రిడిటేషన్లలోనూ అదే వివక్ష
ఇంట్లోకి కొన్ని చీడపురుగులు, ఎలుకలు చొరబడ్డాయని ఇంటినే కాల్చుకున్న వైనంగా ఉంది అక్రెడిటేషన్ల జీఓ. బోగస్‌ జర్నలిస్టులను, పత్రికలను ఏరివేయాలి తప్పులేదు. అయితే ఆ నెపంతో తెలంగాణ పత్రికా వ్యవస్థను, గ్రామీణ జర్నలిస్టు వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టాలనే కుట్రదారులు ఎవరన్నది ప్రభుత్వం నిగ్గుతేల్చాల్సిన అంశం. 50ఏళ్ల చరిత్రలో జర్నలిస్టుల ధర్నా ఇందుకో సాక్షిభూతంగా నిలుస్తుంది.
ఇప్పటికిప్పుడే, కేవలం రెండున్నర ఏళ్లలోనే అన్ని సర్దుకుంటాయని ఎవరూ ఊహించరు. మరి వచ్చే 10ఏళ్ల కాలంలోనైనా స్థానిక పత్రికలు నిలదొక్కుకోడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, రాయితీలు ఏంటని ప్రశ్నిస్తే సమాధానం శూన్యం. కుల,ప్రాంత వివక్షకు గురైన తెలంగాణ మీడియా రంగానికి నిబంధనలులేని సహకారాన్ని ప్రభుత్వం అందించి ప్రోత్సహిస్తే తప్ప రెండుదశాబ్ధాల తర్వాతనైనా తెలంగాణ పత్రికలు, స్థానికంగా తమకోసం తాము పనిచేయడానికి ఊపిరిపోసుకోలేవు. ఒక్క ‘నమస్తేతెలంగాణ’ మాత్రమే సరిపోదనే నిజాన్ని కేసీఆర్‌ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *