జర్నలిస్టులకు ‘నమస్తే తెలంగాణ’ తీపికబురు

Naresh

 అందరూ ఆడిపోసుకున్నారు.. సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఒరిగేదేమిటని.. మాకొచ్చే లాభం ఏంటని అందరూ కామెంట్లు చేశారు. కానీ దీర్ఘకాలిక వ్యూహంతో కేసీఆర్ వేసిన ఈ కొత్త ఎత్తుగడ ఎన్నో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వందల మందికి ఉపాధిని కల్పిస్తోంది. అంతేకాదు.. ఉన్న ఉద్యోగులకు కూడా మెరుగైన వేతన, మంచి ఉద్యోగాలు, జీతభత్యాలు కల్పించేలా చేస్తోంది..
కేసీఆర్ కొత్త జిల్లాల ప్రకటన వల్ల ఎవ్వరు లాభపడినా పడకపోయినా అనవసరం కానీ.. తెలంగాణ జర్నలిస్టుల జీవితాలు మాత్రం మారిపోతున్నాయి..వారు కలలో కూడా ఊహించని అవకాశాలు వారి తలుపుతడుతున్నాయి. కొత్త జిల్లాల ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పత్రికలు వాటిపై కసరత్తును చేపట్టాయి. జిల్లాల పెరుగుదలకు అనుగుణంగా కొత్త జిల్లా స్టాఫర్లు, విలేకర్లు.. అలాగే డెస్క్ ల విభజన వాటికి కావాలసిన డెస్క్ ఇన్ చార్జులు, సబ్ ఎడిటర్ల కోసం ముమ్మరంగా చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఉన్న సబ్ ఎడిటర్లు ఏ మూలకు సరిపోరు. దీంతో కొత్తగా జర్నలిస్టులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. చిన్న చితకా పత్రికల్లో చేసిన వారిని కూడా వదిలిపెట్టకుండా పెద్ద పత్రికలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రభ, జనంసాక్షి, సూర్య తదితర చిన్న పత్రికల సబ్ ఎడిటర్లు కూడా ఈ భూమ్ లో అవకాశాలను అందిపుచ్చుకొని సాక్షి, నమస్తే, ఆంధ్రజ్యోతిలలో సబ్ ఎడిటర్లుగా నియామకం అవుతున్నారు.

ఇక అన్ని ప్రధాన పత్రికలను షేక్ చేస్తూ నమస్తే తెలంగాణ ఏకంగా తన మెయిన్ పేజీలోనే సీనియర్, జూనియర్ సబ్ ఎడిటర్లు కావాలంటూ ప్రకటన ఇచ్చింది.. సగటును సబ్ ఎడిటర్లకు 16000 రూపాయలు, సీనియర్లకు 22000-25000 రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయినట్టు సమాచారం. దీంతో ఈ ప్రకటన మిగతా సాక్షి, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు గుబులు రేపుతోంది. అధికార పార్టీ పత్రిక కావడం.. మరో ఐదేళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉండడం పక్కా కావడంతో భవిష్యత్ దృష్ట్యా నమస్తేలో అవకాశం కోసం జర్నలిస్టులందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఇప్పుడు సాక్షి, ఆంధ్రజ్యోతి నుంచి కూడా వలసలకు ఈ ప్రకటన అవకాశం కల్పించింది. దీనివల్ల ఆ రెండు పత్రికా యాజమాన్యాలకు నమస్తే ముందస్తు హెచ్చరికలు పంపినట్టైంది. నమస్తేకు జర్నలిస్టుల తాకిడీ ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే సాక్షి, ఆంధ్రజ్యోతిలతో పోలిస్తే నమస్తే లో వేతనాలు ఎక్కువ.. దీంతో సహజంగానే ఆ పత్రికల్లో చేరడానికి జర్నలిస్టులు ఆసక్తి చూపుతారు.  ఈ పరిణామాలు ముఖ్యంగా సబ్ ఎడిటర్లకు వరంలా మారగా.. యాజమాన్యాలకు తమ మ్యాన్ పవర్ ను కాపాడుకోవడం క్లిష్టతరంగా మారింది. చాలారోజులుగా భూమ్ లేకుండా కాలం గడిపన సబ్ ఎడిటర్ల నెత్తిన నమస్తే ప్రకటన పాలుపోసిందనే చెప్పాలి. ఈ దెబ్బకు యాజమాన్యాలు జీతాలు పెంచడమా లేక వదులుకోవడమా చేస్తాయి. అదే సమయంలో నమస్తే లో మంచి అవకాశం ఎదురుచూస్తుంటుంది. మొత్తానికి నమస్తే వేసిన ఒక్క ప్రకటన ఇప్పుడు జర్నలిస్టుల్లో తీవ్ర చర్చకు.. అదే సమయంలో మంచి భరోసాను కల్పించిందనడంలో సందేహం లేదు..

నమస్తే పత్రిక ప్రకటన

Naresh

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *