జిల్లాల విభజనతో విద్యాశాఖలో లొల్లి

education

జిల్లాల పునర్‌విభజన పాఠశాల విద్యాశాఖలో కొత్త సమస్యలను తీసుకొచ్చేలా కనిపిస్తోంది. విద్యాశాఖలోని డివిజనల్‌ స్థాయి విద్యాశాఖాధికారుల పోస్టులకు మంగళం పాడేలా ప్రభుత్వం అలోచన చేస్తోంది. ప్రస్తుతమున్న రెగ్యులర్‌ డిప్యూటీఈఓలను డీఈఓలుగా ప్రమోషన్లు ఇచ్చి, ఆ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేలా అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే పాఠశాలల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారే అవకాశముంది. సర్కారు ఆలోచనను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో 56 విద్యాశాఖ డివిజన్లున్నాయి. వీటి పర్యవేక్షణ కోసం డిప్యూటీఈఓ అధికారులున్నారు. ప్రతి 40 హైస్కూళ్లకు ఒక అధికారిని నియమిస్తూ గతంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ పోస్టులను 33 శాతం డైరెక్టు రిక్రూట్‌మెంట్‌తోనూ మిగిలినవి ప్రమోషన్ల ద్వారా వీటిని భర్తీ చేస్తారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్‌ అంశం పెండింగ్‌లో ఉండటంతో ప్రమోషన్లన్నీ నిలిచిపోయాయి. దీంతో కొన్నేండ్లుగా ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 56 పోస్టులకు గానూ కేవలం 11 మంది మాత్రమే రెగ్యులర్‌ డిప్యూటీఈఓలు పనిచేస్తున్నారు. విద్యాశాఖ విభజనను నియోజకవర్గ పరిధిని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీఈఓ పోస్టులను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. అయితే ప్రస్తుతం కొత్త జిల్లాల నేపథ్యంలో శాఖలతో పాటు పోస్టులనూ తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్తగా 17 జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న 11 మందిని డీఈఓలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ పోస్టులు పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశమున్నది. ఇక ఇదే అదునుగా ఈ పోస్టులనూ రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, శాఖల విభజన కోసం ప్రభుత్వ సీఎస్‌ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని కమిటీ కూడా ఇదే ప్రతిపాదన చేశారు. అయితే డీఈఓకు తోడుగా జిల్లాకొక డిప్యూటీఈఓను నియమించాలనే ఆలోచన కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ జిల్లాకొకరిని నియమించుకుంటే 21 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)లకు, ఆరుగురు డైట్‌ లెక్చరర్స్‌కు ఇన్‌చార్జీలుగా బాధ్యతులు అప్పగించాలనే ఆలోచనా చేస్తున్నది.

ఎంఈఓలే బాసులు..

మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్ల పర్యవేక్షణ పూర్తిగా మండల విద్యాశాఖాధికారులపై పడనున్నది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్‌, ప్రయివేటు పాఠశాలలనూ వీరే పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న వాటినే పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్న ఎంఈఓలపై ఈ అదనపుభారం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టనున్నది. దీంతో విద్యాశాఖ పాలన గాడితప్పే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రయివేటు పాఠశాలల ఆగడాలు మరింత పెరిగే అవకాశమున్నదని హెచ్చరిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *