
పొలిటికల్ -మీడియా ఈ రెండు వేర్వేరు రంగాలు.. ఈ రెండు కలగలసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం జర్నలిస్టులతో ఆడుకుంటున్నాయి. పొలిటికల్ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం పెట్టిన పత్రికలు , చానాళ్లను డబ్బులు అయిపోగానే మూసివేస్తున్నారు. నష్టాలు వచ్చాయంటూ జర్నలిస్టులను రోడ్డున పడేస్తున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది..
మూడేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన సీవీఆర్ న్యూస్ మూడేళ్లకే మూతపడింది.. సంస్థను నడిపించలేమని యాజమాన్యం సీవీఆర్ న్యూస్ ఆఫీసుకు తాళం వేసింది. దీంతో అందులో ఉన్న ఉద్యోగులు ఆఫీసులో ధర్నా నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ఇది కొనసాగుతోంది. ఉద్యోగులకు సంఘీభావంగా టీయూడబ్ల్యూజే నేత వచ్చి వారికి ఈ వారం రోజుల పాటు భోజన వసతిని కల్పించారు.దీంతో వారు కార్యాలయంలోనే తింటూ అక్కడే ధర్నా చేస్తున్నారు. తక్షణం తమ 6 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇన్ పుట్ ఎడిటర్, యాంకర్స్ ఇన్ చార్జి అరాచకాలు సృష్టిస్తున్నారని.. వారే తమకు జీతాలు రాకుండా చేసి ఉద్యోగులు ఊడబికించారని ఆరోపించారు.. కాగా ప్రస్తుతానికి సీవీఆర్ న్యూస్ మూతపడ్డట్టే.. కనీసం వారికి పెండింగ్ జీతాలు వచ్చేటట్టైనా ప్రభుత్వం, టీయూడబ్ల్యూజే నేతలు కృషి చేస్తే వారిని ఆదుకున్నవారవుతారు..