క్యాన్సర్ రైలు వస్తోంది..

canser
 ప్రతిరోజూ మనదేశంలో కొన్ని వేల రైళ్లు నడుస్తున్నాయి. అయితే వేటికీ లేని ప్రత్యేకత అబోహర్‌- జోథ్‌పుర్‌ 54703 ప్యాసింజర్‌ రైలుకి ఉంది. పంజాబ్‌లోని బఠిండా స్టేషన్‌కి రాగానే ఆ రైలు పెట్టెలన్నీ ఒక్కసారిగా క్యాన్సర్‌ రోగులూ వాళ్ల బంధువులతో నిండిపోతాయి. అక్కడనుంచి ఆ చెమ్మగిల్లిన హృదయాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని లాలించి నిద్రపుచ్చుతూ ఆశల్ని చిగురింపజేస్తూ బీకానెర్‌కు చేరుస్తుంది. దాంతో దాని పేరే క్యాన్సర్‌ ట్రెయిన్‌గా మారిపోయింది.
క్యాన్సర్‌ రోగులు ఒక ప్రాంతం నుంచి చికిత్స కోసం మరో ప్రాంతానికి వెళ్లడం అనేది సాధారణమే. కానీ ఒకే ప్రాంతం నుంచి ప్రతిరోజూ సుమారు వంద మంది రోగులు ఒకే రైల్లో ఒకే చోటుకు చికిత్స కోసం వెళ్లడమే అసాధారణం. వారాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువ. అందుకే ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో ఈ రైలు క్యాన్సర్‌ ట్రెయిన్‌గా పేరొందింది.
దీనికి కారణాలు లేకపోలేదు. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలోని మాన్సా, సంగ్రూర్‌, బఠిండా, ఫరీద్‌కోట్‌, మోగా, ముక్త్‌సర్‌, ఫిరోజ్‌పుర్‌ జిల్లాల్లో దశాబ్ద కాలం నుంచీ క్యాన్సర్‌ రోగుల సంఖ్య బాగా పెరిగింది. చికిత్స చేయించుకుందామంటే వాళ్లలో ఎక్కువమంది కూలీలూ సన్నకారు రైతులే. చుట్టుపక్కల పట్టణాల్లోని ప్రైవేటు క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో చికిత్స ఎంతమాత్రం అందుబాటులో లేదు. పరీక్షలకే లక్షల రూపాయలు కావాలి. దాంతో వాళ్లంతా బీకానెర్‌ ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రికి ప్రయాణం కడుతున్నారు. అక్కడకు వెళ్లడానికి వాళ్లకు ఉన్న సౌకర్యం ఈ ప్యాసింజర్‌ రైలే. సరిగ్గా రాత్రి 9.20కి కదిలే ఈ రైలెక్కి ఉదయం ఆరు గంటలకు బీకానెర్‌కు చేరుకుంటారు.
అక్కడ పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవడం పూర్తయిపోతే తిరిగి రాత్రికి 9.30కి అదే రైలెక్కి ఉదయానికల్లా బఠిండాకు చేరుకోవచ్చు. పైగా ఈ రైలు మొత్తానికి స్లీపర్‌ కోచ్‌ ఒక్కటే. కాబట్టి మిగిలిన పెట్టెలకు రిజర్వేషన్‌తో పనిలేదు. అదీగాక చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళివచ్చేందుకు క్యాన్సర్‌ రోగులకు రైలు టిక్కెట్టు ఉచితం. వాళ్ల సహాయకులకు కూడా 75 శాతం ఫ్రీనే. దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి క్యాన్సర్‌ బాధితులంతా రాత్రి తొమ్మిది గంటలకే బఠిండా స్టేషనుకి చేరి ఈ రైలు రాకకై నిరీక్షిస్తుంటారు.
* ఆ ఆసుపత్రి కోసమే…
పంజాబ్‌వాసులంతా బీకానెర్‌ వెళ్లడానికి రైలు సౌకర్యం ఉండటం ఒక్కటే కాదు. అక్కడ ‘ఆచార్య తులసి రీజనల్‌ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ సేవాదృక్పథంతో పనిచేయడమూ కారణమే. ఈ ఆసుపత్రి రోగుల ఆర్థికస్థోమతతో పనిలేకుండా అందరికీ సమానమైన చికిత్సను ఉచితంగా అందిస్తుంది. ఔషధ తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని హోల్‌సేల్‌ ధరకే మందుల్ని విక్రయిస్తోంది. చికిత్స చేయించుకోవడానికి అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చినా ఖర్చుకి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఆసుపత్రి క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం ఉంటుంది. రోగులకు పాలు ఉచితంగానే ఇస్తారు. ఇతర పట్టణాలతో పోలిస్తే అక్కడి ధర్మశాలలో యాభై రూపాయలకే గది దొరుకుతుంది. అందుకే క్యాన్సర్‌ వ్యాధి సోకిన బక్క రైతు కుటుంబాలన్నీ బీకానెర్‌ బాటపడుతున్నాయి. ఆ రైల్లో ఎవరిని మాట్లాడించినా ఇదే విషయం చెబుతారు.
‘మా దగ్గర చూపించుకుంటే పరీక్షలకే రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయింది. చికిత్స మొదలుకాలేదు. అదే అక్కడైతే మొత్తం 30 వేల రూపాయలకే అయిపోయింది’ అంటాడు అబోహర్‌కి చెందిన జనకరాజ్‌.
‘బఠిండాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అన్నీ ఏసీ గదులే. రోజుకి రెండు వేల రూపాయలు అద్దె. చికిత్సకు ఎంతవుతుందో చెప్పలేం. అదే అక్కడయితే నామమాత్రపు రుసుము ఉంటుంది’ అంటున్నాడు బీకానెర్‌లో తన తల్లికి గర్భాశయ వ్యాధికి వైద్యం చేయించుతోన్న సుర్జీత్‌ సింగ్‌. ఫరీద్‌కోట్‌ జిల్లాలోని మాలాన్‌ గ్రామానికి చెందిన మదన్‌లాల్‌ అన్నవాహిక క్యాన్సర్‌ నివారణకోసం కనీసం 30 సార్లు అయినా ఈ రైలెక్కి ఉంటాడు.
జాల్‌ కౌర్‌… డెబ్భె ఏళ్ల వృద్ధురాలు. బఠిండా సమీపంలోని గ్రామానికి చెందిన ఆమెకు ఏడాది క్రితమే గర్భాశయ క్యాన్సర్‌ వచ్చిందట. చికిత్సకోసం తరచూ ఆమె ఈ రైల్లోనే బీకానెర్‌కు వెళుతుంటుంది. ఆమె కూర్చున్న బోగీలోని ప్రయాణికుల్లో చాలామంది ఆమెకి సుపరిచితులే. వాళ్లందరిదీ ఒకే వూరు మరి. ఆ వూళ్లొని మొత్తం 300 కుటుంబాల్లో 70 కుటుంబాలు క్యాన్సర్‌ బారిన పడ్డాయట. ఇలా ఈ రైల్లో ఎవరిని కదిలించినా క్యాన్సర్‌ కథలే… కన్నీటి వెతలే. ఇంకా చెప్పాలంటే ఈ రైలు ప్రయాణికుల్లో 60 శాతం క్యాన్సర్‌ రోగులే. బీకానెర్‌ ఆసుపత్రికొచ్చే రోగుల్లోనూ సగంమంది పంజాబీలే కావడం దురదృష్టకరం.
* పురుగుమందులే!
దీనికి ప్రధాన కారణం 1960లనాటి హరిత విప్లవమే. దిగుబడికోసం రసాయనాల్ని అధికంగా వాడటంవల్ల రాష్ట్రం క్యాన్సర్‌ రోగాల పుట్టగా మారుతోంది. రోజుకి 18 మంది క్యాన్సర్‌ కారణంగా మృతి చెందుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మాల్వా ప్రాంతంలో పత్తి పంట ఎక్కువ. దాంతో క్రిమికీటకాల్ని నివారించే రసాయన స్ప్రేల వాడకం మరీ ఎక్కువ. ఒక్క మహినంగల్‌ గ్రామంలోనే ఏటా రెండు కోట్ల రూపాయల ఖరీదు చేసే పురుగుమందులు వాడుతున్నారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా అక్కడి నీటిలోనూ భూమిలోనూ క్యాన్సర్‌ కారకాలు నిక్షిప్తమైపోయాయి. పైగా సంవత్సరాల తరబడి ఈ మందుల వాడకంవల్ల అవి క్యాన్సర్‌ కారక జన్యుమార్పులకూ కారణమవుతున్నాయి అంటున్నారు వైద్యులు. ఏదయితేనేం… తమచుట్టూ ఉన్న పచ్చటి పొలాలే తమ పాలిట యమపాశాలుగా మారుతున్నాయని తెలిసినా వాటిని వదులుకోలేరు మాల్వా వాసులు. కానీ జీవితంలో భాగంగా మారిపోయిన క్యాన్సర్‌ వ్యాధితో మాత్రం భీకర పోరాటమే చేస్తున్నారు… తమ పాలిట ‘జీవన రేఖ’గా మారిన రైలు సాయంతో..!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *