
మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్లాక్‌మనీని దాచుకున్న నల్ల కుబేరులకు ఇది ఊహించని షాక్. అయితే అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకూ చెల్లుబాటయిన 86శాతం డబ్బుకు సంబంధించిన క్రయవిక్రయాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం నవంబర్ 8న రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకూ 217 బిలయన్ డాలర్లు, మన కరెన్సీలో 14లక్షల కోట్ల రూపాయల సొమ్ము వినియోగంలో ఉంది.
ఇందులో 7.85లక్షల రూపాయల 5వందల నోట్లు, 6.33లక్షల వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. అయితే ఇందులో ఉద్దేశపూర్వకంగా మార్చుకోని సొమ్ము కొంత ఉంటే, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల సొమ్ము మరికొంత ఉంది. అయితే ఈ నిలిచిపోయిన సొమ్ములో సగానికి పైగా, అధిక శాతం నల్ల డబ్బేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండుమూడు రోజుల్లోనే ఇంత డబ్బు బయటపడితే, ఇంకెంత డబ్బుందోనని చర్చించుకుంటున్నారు. కొన్నికొన్ని ప్రాంతాల్లో డబ్బును తగలబెట్టడం, చెత్త కుప్పల్లో పడేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. బ్లాక్‌మనీని సంపాదించిన బడా బాబులు ఎన్ని తిప్పలు పడుతున్నారో ఈ సంఘటనలే నిరూపిస్తున్నాయి.