
దాదాపు 5 వేల ఏళ్ల కిందటి ముచ్చట ఇది.. అంటే క్రీస్తుకు పూర్వం దాదాపు 3 వేల ఏళ్ల కిందట అన్నమాట.. అప్పుడు మానవ నాగరికత లేదు.. ఆదిమ మానవులు గుహలలో నివసిస్తూ సమీప నదులు, వాగులు, నీటి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తూ వేటనే ప్రధాన వృత్తిగా జీవిస్తుండేవారు. మన తెలంగాణలోని చాలా చోట్ల ఆదిమ మానవుల అవశేషాలు బయటపడ్డాయి. కానీ కరీంనగర్ జిల్లా పొట్లపల్లిలో ఆదిమ మానవుల గుహలు, వారి వస్తువులు, వారు ఉపయోగించిన వివిధ పరిసరాలు, సమాధులు పరిశోధకులు కనుగొన్నారు.. అందులో కొన్ని కీలక ఆంశాలు వెలుగుచూశాయి..
కరీంనగర్ మానేరు డ్యాంలో కలిసే ఎల్లమ్మ (మోయతుమ్మెద) వాగు, అలాగే కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టు పరిసర కూరెల్ల గుట్లల్లో ఆదిమ మానవులు నివసించినట్టు పరిశోధకులు తేల్చారు. ఇందులో హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గుట్టల్లో ఆదిమ మానవుల గుహలు, అందులో చిత్రాలు, వారి సమాధులు ఇక్కడి వారి సంస్కృతిని తేటతెల్లం చేశాయి. పొట్లపల్లిలో నాగరికత వర్ధిల్లినట్టు తెలిసింది. వాగులో ఉండే నీటి ప్రవాహాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఆదిమ మానవులు నడియాడి మనుగడ సాగించినట్టు సమాచారం. ఇక్కడ అందుకే పొట్లపల్లి ఎల్లమ్మ వాగు పక్కనే ఉన్న గుట్టల్లో మరిన్ని ఆధారాల కోసం పరిశోధకులు వెతుకులాట ప్రారంభించారు. ఈ గుట్టనే దెయ్యల గుట్ట అని కూడా అంటారు. ఇప్పటికీ దీని దగ్గరికి స్థానికులు వెళ్లడానికి భయపడుతారు. అందుకే ఇన్నాళ్లు గుట్టలో ఉన్న ఆదిమ మానవుల అవశేషాలు వెలుగుచూడలేదు..