
ఛత్తీస్గఢ్, ప్రతినిధి : డాక్టర్ల నిర్లక్ష్యం మహిళల పాలిట శాపమైంది. ప్రభుత్వం ఆర్భాటం ప్రారంభించిన కు.ని శిభిరం ఆభాసుపాలై పేద మహిళల మృతికి కారణమైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 8మంది మహిళలు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో చోటుచేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మరో 50 మంది మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో 20మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. పరిస్థితి విషమంగా ఉన్నవారికి రూ.50 వేలు సాయం ప్రకటించింది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 83మంది మహిళలు (లాప్రోస్కోపీ) ఆపరేషన్లు చేయించుకున్నారు. అయితే ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు సోమవారం మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మంగళవారం మరణించినట్లు సమాచారం.మిగతావారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.