
నెల్లూరు : నేటితో నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. “మెడికల్ కళాశాల” నెల్లూరు వాసులను ఐదు దశాబ్దాలుగా ఊరిస్తున్న కల. ఎప్పుడెప్పుడు ఈ స్వప్నం నిజమవుతుందా..? అని 50 ఏళ్లుగా చూసిన ఎదురు చూపులు నేటితో ఫలించబోతున్నాయి. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న వైద్య కళాశాలలో నేటి నుంచి తరగతులు ప్రారంభం కాబోతున్నాయి.
అసంతృప్తి.. ఆపై కేటాయింపు..
2012 ఆగస్టు 8న ఈ మెడికల్ కాలేజీకి ఎసెన్షియల్ ధృవీకరణ పత్రం జారీ అయ్యింది. కళాశాల నిర్మాణానికి దొడ్ల సుబ్బారెడ్డి ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో 100 ఎకరాలు కేటాయించారు. 2013 మార్చి 3న అప్పటి సీఎం కిరణ్ శంఖుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయ్యాక సందర్శించిన ఎంసీఐ బృందం, సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కళాశాలకు ఈ ఏడాది కూడా సీట్ల కేటాయింపు కష్టమే అనుకుంటున్న తరుణంలో 150 సీట్లు కేటాయిస్తూ ఎంసీఐ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నో ఏళ్ల కల ఈ రోజు తీరుతుండడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.