
26 న మిషన్ కాకతీయ పై వీడియో కాన్ఫరెన్సు .
నెలాఖరులోగా మిషన్ కాకతీయ 1 పనులను పూర్తి చేయాలీ.
రెండో విడత పనులకు డెడ్ లైను డిసెంబర్.
మూడో విడత పనులను వేగవంతం చేయాలి.
నాలుగో విడత ఏం.కె.ప్రతిపాదనలు ఈ నెలాఖరులో సిద్ధం చేయాలి.
మిషన్ కాకతీయ పై మంత్రి హరీష్ రావు సమీక్ష.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనుల నాణ్యతలో రాజీ పడరాదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల మొత్తం కార్యక్రమానికి మచ్చ వస్తుందన్నారు. జలసౌధలో శనివారం నాడు మంత్రి మిషన్ కాకతీయ కార్యక్రమం పై ఆన్ లైను ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలు, మండలాల వారీగా మిషన్ కాకతీయ 1,2,3 దశలలో నడుస్తున్న పనులను మంత్రి సమీక్షించారు. ఈ నెల 26 న మిషన్ కాకతీయ పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. మిషన్ కాకతీయ 1 పనులను ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఏం.కె. కింద మంజూరయి ప్రారంభించిన పనుల్లో ఇంకా అక్కడక్కడా కొన్ని చోట్ల, కొన్ని పనులు పూర్తి కాకపోవడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఎం.కె. 2 కింద చేపట్టిన పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎం.కె. 3వ దశలో చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైను లో అప్ లోడు చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. మిషన్ కాకతీయ 4 వ విడత చేపట్టనున్న పనులను గుర్తించి ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి పంపించాలని మంత్రి కోరారు. ఎలాంటి లోపాలు లేకుండా, మళ్ళీ సవరణలకు, మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా , సంబంధిత చెరువుల పునరుద్ధరణకు గాను నిజంగా అవసరమైనవనుకున్న పనులకే అంచనాలు రూపొందించాలని అన్నారు. మిషన్ కాకతీయ కింద చేపట్టవలసిన పనుల ఎంపిక, అంచనాలు రూపొందించడం, నిర్మాణ పనులు,పనులు పూర్తయ్యాక కొలతల నమోదు, బిల్లుల మంజూరు తదితర అన్నీ విషయాల్లోనూ కిందిస్థాయి జె.ఈ. మొదలుకొని చీఫ్ ఇంజనీర్ వరకు అన్నీ వేళలా అప్రమత్తమ్ గా ఉండాలని ఆయన కోరారు. దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్న మిషన్ కాకతీయ పనులలో చిన్న చిన్న పొరపాట్లు, అవతవకలు లేకుండా చూడాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలపై కొన్ని చెరువుల గురించి ఇటీవల వచ్చిన వార్తలను మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. క్వాలిటీ విషయం లో కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించరాదని మంత్రి అన్నారు.సి.ఈ., ఎస్.ఈ. లు క్షేత్రస్థాయిలో వెళ్ళి మిషన్ కాకతీయ పనులను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.నిర్మాణ పనులపై నాణ్యతా విభాగం ఎస్. ఈ, సి.ఈ. లు ఆకస్మిక తనిఖీలు చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనులను సందర్శించకుండా ఆఫీసుల్లో కూర్చొని సంతకాలు చేసే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని హరీశ్ రావు చెప్పారు. ఎం.కె. కింద చేపట్టే చెరువుల పునరుద్ధరణ లో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి చెరువు కట్ట కు ఇరువైపులా మొక్కలు నాటాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు గాను సంబంధిత శాఖ ల సహకారం తీసుకోవాలని మంత్రి కోరారు. తెలంగాణలోని మొత్తం చెరువులకు జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె. జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఈ.ఎన్.సి. నాగేందర్ర్ రావు,సి. ఈ. లు శ్యామ్ సుందర్, సురేశ్ కుమార్, ఎస్.ఈ.లు, ఈ.ఈ. లు పాల్గొన్నారు.