
కరీంనగర్,ప్రతినిధి : 2017 తర్వాత పుట్టినబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి పునాదులు పడ్డాయని.. 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ కేంద్రాల ద్వారా దేశంలోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఎదిగే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కేసీఆర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా రాయికల్ లో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు,కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోలోరాం చినజీయర్ స్వామి, రాష్ట్ర మంత్రి చందూలాల్ , ఎంపి కవిత, కలెక్టర్ నీతూ ప్రసాద్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ జెన్ కో, ఎన్టీపీసీ, సింగరేణి ద్వారా రెండేళ్లలో తెలంగాణ విద్యుత్ కష్టాలు తీరుతాయన్నారు. ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలు సైతం నెరవేర్చామని పించన్లను అన్ని పార్టీలకంటే భిన్నంగా వేయి ఇచ్చి పేదల ఆకలితీరుస్తున్నామని చెప్పారు. పింఛన్లు, ఆహారభద్రత, కళ్యాణలక్ష్మీ, బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రగతిని సాధించడమే లక్ష్యంగా మిషన్ కాకతీయ కు శ్రీకారం చుట్టామని.. కేసీఆర్ అన్నారు. వాటర్ గ్రిడ్ ఇంటింటికి 2019లోపు మంచి తాగునీరిస్తామని.. ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని తేల్చిచెప్పారు. 2019వరకు రాజకీయాలు వద్దని అందరం తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.