
కరీంనగర్: 2017 చివరి నాటికి వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం మంత్రి జిల్లా, పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ తో కలిసి మిషన్ భగీరధ పధకం క్రింద చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులను ఎల్.ఎం.డి.కాలనిలో క్లియర్ వాటర్ రిజర్వాయర్, ఎల్.ఎం.డి.డ్యాం వద్ద ఇంటెక్ వెల్, ఉజ్వల పార్క్ వద్ద నగరానికి నీటి సరఫరా చేయు విధానం, ఎలగందుల వద్ద వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, క్లియర్ వాటర్ పంప్ నిర్మాణం, అగ్రహరం వద్ద నిర్మాణంలో ఉన్న వాటర్ గ్రిడ్ పైపులైన్ల పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందించుట రాష్ట్ర్ర ముఖ్యమంత్రి ఆశయమని అన్నారు. వాటర్ గ్రిడ్ పనులను 2017 చివరి నాటికి పూర్తి చేయుటకు పనుల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను తనిఖీ చేయుటవలన ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి వస్తాయని వాటిని వెంటనే పరిష్కరించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయుటకు వీలవుతుందని తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా కొన్ని వేల కోట్లు వెచ్చించి వాటర్ గ్రిడ్ పనులు చేపట్టిందని పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి మన్నికగా పది కాలాల పాటు ఉపయోగపడేలా ఉండాలని ఆయన అన్నారు. ఇంతవరకు ఎల్.ఎం.డి. నుండి కరీంనగర్ పట్టణానికి తాగునీటి అవసరాలకు వాడుకున్నామని వాటర్ గ్రిడ్ ద్వారా ఎల్.ఎం.డి. నుండి నీటికి హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాలతో పాటు మానకొండూర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు, వరంగల్ జిల్లా ప్రజలకు తాగునీరు అందించుటకు వాటర్ గ్రిడ్ ద్వారా నిర్మాణాలు జరుగుచున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో వాటర్ గ్రిడ్ ద్వారా జిల్లాలో ఎంత కరువున్న తాగునీటికి మాత్రం ప్రజలకు ఇబ్బంది రాకుండా సరఫరా చేస్తామని తెలిపారు. కరీంగనగర్ జిల్లా సాగు, తాగునీటికి జెంక్షన్ గా మారుతుందని అన్నారు. వచ్చే జూన్ లో మధ్యమానేరు ప్రాజెక్టు లో 3 టీ.ఎం.సి.ల నీటిని ఆపుతామని తెలిపారు. 2017 నాటికి మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి స్ధాయిలో నిర్మాణం చేస్తామని అన్నారు. కరీంనగర్ జిల్లా అన్ని రంగాలలో ముందుంచుతామని అన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించుటకు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మిస్తామని అన్నారు. వచ్చే దసరా పండుగ నాటికి రాష్ట్ర్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు పూర్తవుతుందని మంత్రి తెలిపారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్ని జిల్లాలు అనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.
శాబాష్ పల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రిః
బోయినపల్లి మండలం శాబాష్ పల్లి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం కొనసాగుతున్నాయని తెలిపారు. నెల రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. ప్రస్తుతం ఒక బ్రిడ్జి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని త్వరలో మరో బ్రిడ్జి మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగామంజూరు చేయు బ్రిడ్జిని 2017 వరకు పూర్తిచేస్తామని తెలిపారు. తద్వారా కరీంనగర్ నుండి సిరిసిల్ల నాలుగు వరుసల రోడ్డుకు ఈ రెండు బ్రిడ్జిలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, కరీంనగర్, చొప్పదండి శాసన సభ్యులు గంగుల కమలాకర్, బొడిగె శోభ, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మిషన్ భగీరధ ఎస్.ఇ. శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్.ఇ. సూర్యప్రకాష్, కరీంనగర్, సిరిసిల్ల ఆర్గీఓలు చంద్రశేఖర్, బిక్షనాయక్, సంబంధిత మండలాల జెడ్సి.టి.సి.లు, ఎం.పి.ిపి.లు, తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.