198 కోట్ల రూపాయలతో కేజీబీవీల భవనాల నిర్మాణం – కడియం శ్రీహరి

 

ఈ నెల 15వ తేదీలోపు 61 కేజీబీవీల అకాడమిక్ బ్లాక్లు, 34 కేజీబీవీల భవనాల శంకుస్థాపన

ఈ బ్లాకుల నిర్మాణానికి 2018 అక్టోబర్ తుది గడువు

ఈ నెల 9వ తేదీలోపు విద్యార్థులందరికీ హెల్త్ కిట్ల పంపిణీ పూర్తి కావాలి

పరీక్షల్లో ఫలితాల పెంపునకు కలెక్టర్ల నేతృత్వంలో 31 జిల్లాల ఉపాధ్యాయుల సమీక్షలు చేయాలి

కేజీబీవీల సమీక్షలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దిశానిర్ధేశనం

హైదరాబాద్, జనవరి 02 : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 198 కోట్ల రూపాయలతో 61 అకాడమిక్ బ్లాక్ లు, 34 కేజీబీవీలకు నూతన భవనాలకు ఈ నెల 15వ తేదీలోపు శంకుస్థాపనలు చేసి, 2018 అక్టోబర్ నాటికి భవనాలు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు గడువు విధించారు. తెలంగాణ రాష్ట్ర కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు దేశంలో అత్యుత్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్టంగా మార్చాలని చెప్పారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), మోడల్ స్కూల్స్, విద్యాశాఖ గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల వసతులు, హెల్త్ కిట్ల పంపిణీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇతర అధికారులతో సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష చేశారు.

కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకుల విద్యాలయాల్లో మొత్తంగా 1, 03,000 మంది విద్యార్థులున్నారని, వీరందరికీ ఈ నెల 9వ తేదీలోపు హెల్త్ కిట్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ కిట్లను నాలుగు దఫాలుగా 12 నెలలకు సరిపడే విధంగా మూడు నెలలకొకసారి పంపిణీచేయాలన్నారు. ఈ హెల్త్ కిట్లను బాలురు, బాలికలకు పంపిణీ చేస్తున్నామని అధికారులు ఉపముఖ్యమంత్రికి తెలిపారు. బాలికలకు అవసరమయ్యే సామాగ్రితో బాలికల హెల్త్ కిట్స్, బాలురకు కావల్సిన సామాగ్రితో బాలుర హెల్త్ కిట్స్ రూపొందించి అందిస్తున్నట్లు వివరించారు. లక్ష మందికి ఈ హెల్త్ కిట్ల కోసం ఏటా 12 కోట్లరూపాయలను ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కేజీబీవీలలో ఇలాంటి హెల్త్ కిట్స్ అందించడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. హెల్త్ కిట్స్ తోపాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాల్లో కూడా మనం ఇస్తున్న భోజనం దేశంలో మరెక్కడా ఇవ్వడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అన్ని విద్యా సంస్థల్లో ఒకేరకమైన మెనును విద్యార్థులకు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ మెనులో ఉదయం ఆరుగంటలకే 250 మిల్లీలీటర్ల పాలు తర్వాత బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్నామన్నారు. నెలకు నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్, ప్రతి రోజు గుడ్డు, నెయ్యి కూడా అందిస్తున్నట్లు చెప్పారు. మంచి పోషకాహారం లభించే విధంగా మెనును శాస్త్రీయబద్దంగా రూపొందించినట్లు తెలిపారు. ఇక కేజీబీవీలలో 95 భవనాలలో 61 అకాడమిక్ బ్లాక్స్, 34 కొత్త కేజీబీవీల భవనాలకు ఈ నెల 15వ తేదీలోపు శంకుస్థాపనలు పూర్తి చేసి, ఇదే ఏడాది అక్టోబర్ నెలలోపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు ఆదేశాలిచ్చారు. మొత్తం 198 కోట్ల రూపాయలతో నిర్మించే వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వీటి నిర్మాణాన్ని ఆన్ లైన్ లో రోజువారిగా సమీక్షించాలన్నారు.

ఇక పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారిగా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఈ సమీక్షలో పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు, మార్కులు సాధించడంపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులకు పరీక్షలకు ప్రిపేర్ కావడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ సంచాలకులు కిషన్, విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మల్లేషం, కేజీబీవీల డైరెక్టర్ శ్రీహరి, మోడల్ స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి,  ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *