19న టీయూడబ్ల్యూజే ప్రథమ మహాసభకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రథమ మహాసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 19న ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కామేడ్ర్ షోయబుల్లఖాన్ ప్రాంగణం,లలితకళాతోరణం, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నాంపల్లిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7000 మందికి పైగా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ కు తరలివస్తున్నారు.

ప్రథమ మహాసభకు ముఖ్య అతిథిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ , ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ప్రభుత్వ సలహాదారు కే.వి రమణాచారి, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి ఆర్వీ చంద్రవదన్ హాజరుకానున్నారు.

విశిష్ట అతిథులుగా ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ ఎల్ పీ నేత డా. లక్ష్మన్, ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ, సీపీఐ నేత రవీంద్ర కుమార్ రమావత్, సీపీఎం నేత సున్నం రాజయ్య పాల్గొననున్నారు.

మహాసభకు ఆత్మీయ అతిథులుగా ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్ సిన్హా , ఐజేయూ జనరల్ సెక్రెటరీ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్ హాజరుకానున్నారు.

కాగా తెలంగాణలో తొలిసారి జరిగే ఈ మహాసభలను విజయవంతం చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు తరలిరావాలని  ముఖ్య సలహాదారులు కే.శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ లు ఒక ప్రకటనలో కోరారు.ఈ మహాసభలో తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులపై తీర్మానాలు చేయనున్నట్టు, అలాగే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి తేనున్నట్టు పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *