1810 కోట్లతో వార్షిక రుణప్రణాళికకు ఆమోదం తెలిపిన స్త్రీనిధి సర్వ సభ్య సమావేశం

———————————
* స్త్రీ నిధి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
* 1810 కోట్లతో వార్షిక రుణప్రణాళికకు ఆమోదం తెలిపిన స్త్రీనిధి సర్వ సభ్య సమావేశం
* గత ఏడాది వచ్చిన లాభంలో ప్రభుత్వ డివిడెండ్‌గా 3 కోట్ల 48 లక్షల 16 వేలను మంత్రి జూపల్లి కృష్ణారావుకు అందజేసిన స్త్రీ నిధి పాలకవర్గం
* 2017-18 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో 1585 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 225 కోట్ల రుణాలను అందజేయనున్న స్త్రీ నిధి బ్యాంకు
* పాడి గేదెల కొనుగోలు కోసం 100 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయం
* సభ్యుల పిల్లల కోసం సైకిల్ కొనుగోలుతో పాటు…స్మార్ట్ ఫోన్, ఆటో రిక్షా, ట్రాలీల కొనుగోలుకు, మరుగుదొడ్ల నిర్మాణాలకు సైతం రుణాలు ఇవ్వాలని నిర్ణయం
* స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం కొత్త ఇన్సూరెన్స్ పథకానికి రూపకల్పన, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 4 లక్షల రూపాయలు అందే విధంగా భీమా పథకం

హైదరాబాద్ : అప్పులు తీసుకోవడం, పొదుపు చేయడానికే మహిళా సంఘాలు పరిమితం కావద్దని…గ్రామాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో గురువారం జరిగిన స్త్రీ నిధి మూడవ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అథితిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తీసుకున్న రుణాల్లో 99 శాతాన్ని తిరిగి చెల్లిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల నమ్మకాన్ని స్త్రీ నిధి పొందటం అభినందనీయమన్నారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు సైతం స్త్రీ నిధి బ్యాంకుతో ఒప్పందాలు చేసుకోవడం అభినందనీయమని…అయితే ఇంకా ఆశించిన స్థాయిలో స్త్రీ నిధి పనిచేయడం లేదన్నారు. మరింత చిత్తశుద్దితో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాగైతే సంఘటితంగా తెలంగాణాను సాధించుకున్నామో, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణా సాధనలో సంఘటితంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉపాధిహామీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ మహిళా సంఘాలు క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. మహిళా సమాఖ్యల అధ్యక్షుల పదవీకాలాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పలువురు సభ్యులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అన్ని సమాఖ్యలకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి… కొంత చదువుకున్న వారికి అధ్యక్షురాలిగా అవకాశం కల్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. గతంతో పోలిస్తే వడ్డీలేని రుణాలను నాలుగింతలు పెంచామన్నారు. గతంలో కన్నా అధిక ప్రయోజనం చేకూరేలా అభయహస్తం పథకంలో మార్పులు చేస్తున్నామని…దీని ద్వారా కోటి 25 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ పథకాలకు సంబంధించిన సమాచారంతో పాటు… ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి అవకాశాలున్నాయో మహిళ సంఘాలకు అవగాహన కల్పించేలా హ్యాండ్ బుక్‌ను రూపొందించాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు.
ప్రభుత్వానికి 3.48 కోట్ల డివిడెండ్ అందజేసిన స్త్రీనిధి….
గత ఏడాది వచ్చిన లాభాల్లో ప్రభుత్వ డివిడెండ్‌గా 3 కోట్ల 48 లక్షల 16 వేలను మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్త్రీ నిధి పాలకవర్గం సభ్యులు అందజేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 1810 కోట్లతో వార్షిక రుణప్రణాళికకు స్త్రీనిధి సర్వ సభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1585 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 225 కోట్ల రుణాలను అందజేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాడి గేదెల కొనుగోలు కోసం 100 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే సభ్యుల పిల్లల కోసం సైకిల్ కొనుగోలుతో పాటు…స్మార్ట్ ఫోన్, ఆటో రిక్షా, ట్రాలీల కొనుగోలు, మరుగుదొడ్ల నిర్మాణానికి సైతం రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్నారు. ఇక స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం కొత్త ఇన్సూరెన్స్ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 4 లక్షల రూపాయలను సభ్యుల కుటుంబాలకు అందేలా దీనికి రూపకల్పన చేశారు. 2015-16 సంవత్సరానికి గత ఏడాది కన్నా ఒక శాతం అధికంగా 8 శాతం డివిడెండ్‌ను చెల్లించాలని తీర్మాణించారు. వెయ్యి రూపాయల అప్పుకు 4 రూపాయలుగా ఉన్న సురక్ష ప్రీమియంను 2.50 రూపాయలకు తగ్గించాలని నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *