15 ఆర్థిక సంఘం ఏర్పాటు కోసం డిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సదస్సు

డిల్లీ – ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా ఇప్ప‌టికే కొత్త‌ మండ‌లాల‌ను, జిల్లాల‌ను ఏర్పాటు చేశామ‌ని… త్వ‌ర‌లో గ్రామాల‌ను కూడా ఏర్పాటు చేయ‌బోతున్న నేప‌థ్యంలో తెలంగాణా రాష్ర్టానికి 15 వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్య‌త‌ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. 15 ఆర్థిక సంఘం ఏర్పాటు కోసం  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన  పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు, ఫైనాన్స్ కమిషన్ అధికారుల సదస్సు డిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో మంగళవారం జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో ప్ర‌సంగించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. స్థానిక సంస్థ‌ల బ‌లోపేతం కోసం 15 వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం తెలంగాణాభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స్థానిక‌ సంస్థ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని… తెలంగాణకి సంబంధించి ప్ర‌స్తుతం గ్రామ పంచాయ‌తీల‌కు ఇస్తున్న‌ నిధులు స‌రిపోవ‌డం లేద‌న్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన నిధులను రెండింతలు చేయాల‌ని కోరామ‌న్నారు. తెలంగాణకి సంబంధించి ఇప్పటిదాకా ఇస్తున్న నిధులు గ్రామాల అభివృద్ధికి సరిపోవట్లేదని మంత్రి జూపల్లి తెలిపారు.  గ్రామాలను పటిష్ఠం చేసేందుకు నిధుల పెంపుతో పాటు.. నిధుల వినియోగం, ప్ర‌ణాళిక‌ల‌లో చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంద‌ని మంత్రి వివ‌రించారు.

jupally krishna rao1

గ్రామ స్వ‌రాజ్యానికి విఘాతం క‌ల‌గ‌కుండ‌ మూడంచెల వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేయాల్సిన అవ‌సరముంద‌న్నారు. కేంద్ర నిధుల‌ను నేరుగా గ్రామ పంచాయతీల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల‌, మండల, జిల్లా ప‌రిష‌త్‌ వ్య‌వ‌స్థ నిర్వీర్యం  అవుతోంద‌న్నారు. గ్రామ పంచాయతీలకు నిధులను  తగ్గించకుండా…జిల్లా, మండల పరిషత్ లకు కూడా ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించాల‌ని సూచించామ‌న్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా మున్సిపాలిటీల్లో అండ‌ర్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్న‌ట్లుగానే… కేంద్ర‌ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మేజ‌ర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లోనూ అండర్ డ్రైనేజీలు  ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాల‌ని కోరిన‌ట్లు మంత్రి జూప‌ల్లి తెలిపారు. వీటితో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటు కోసం ప్ర‌త్యేకంగా నిధులు విడుద‌ల చేయాల‌ని…ఉపాధి హామీ మెటీరియ‌ట్ కాంపొనెంట్ నిధుల విడుద‌ల‌లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాల‌ని కోరామ‌న్నారు. తెలంగాణ లోని గ్రామాలను స్వచ్ఛ – హ‌రిత‌ గ్రామాలుగా మార్చేందుకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని…ఇందుకోసం ప్ర‌తి గ్రామంలోనూ పారిశుద్ధ్య కార్మికుల‌ను ఉపాధి నిధులతో ఏర్పాటు చేసుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరామ‌న్నారు.  దేశంలోనే గ్రామీణాభివృద్ధిలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన తొలి రాష్ట్రం తెలంగాణా అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

jupally krishna rao 3

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర శేఖ‌ర్ రావు ప్ర‌త్యేక చొర‌వ‌తో మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ పేరుతో గ్రామాల‌ రూపురేఖ‌ల్ని మార్చేస్తున్నార‌న్నారు. తెలంగాణలో కొత్త‌గా 4 వేల కు పైగా గ్రామ పంచాయతీ లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని…ఆ గ్రామాల్లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం అదనంగా నిధులు కేటాయించాల‌ని కోరిన‌ట్లు మంత్రి తెలిపారు.  పాలనలో పారదర్శకత వచ్చేలా గ్రామ పంచాయతీ లలోని తీర్మానాలు ఆన్ లైన్లో ఉంచ‌డంతో పాటు… గ్రామ సభల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో  పొందుపరిస్తే బాగుంటుందని సూచించామ‌న్నారు. గ్రామ పంచాయతీ లకు సంబంధించి నిధుల వినియోగంలో కొన్ని అంశాలన‌ సరళికరించి .. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో కొన్ని అధికారాలు రాష్ట్రాలకు, పంచాయ‌తీల‌కు ఇస్తే మెరుగైన ఫలితాలు వ‌స్తాయ‌న్నారు. స్వచ్ఛ భారత్ ప‌థ‌కంలో భాగంగా రాష్ట్రాల‌కు రావాల్సిన నిధులు పెంచి, స‌కాలంలో విడుద‌ల చేస్తే ఆశించిన ఫలితాల‌ను వేగంగా సాధించ‌వ‌చ్చ‌ని మంత్రి తెలిపారు.  24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని గ్రామాలపై మంచినీటి స‌ర‌ఫ‌రా, క‌రెంట్ మోటార్లు కాలిపోతే అయ్యే ఖ‌ర్చుల భారాన్ని  చాలావ‌ర‌కు త‌గ్గిస్తున్నామ‌ని…ఆర్థిక సంఘం నిధులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే స్వేచ్ఛ‌ను రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మ‌న్ రాజేశం గౌడ్ కూడా పాల్గొన్నారు.

jupally krishnarao2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *