105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ఘనంగా నిర్వహిస్తాం: కడియం శ్రీహరి

 

  • ఉస్మానియా యూనివర్శిటీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నదీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం
  • భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ కు హాజరవుతున్నారు
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న నోబెల్ పురస్కారగ్రహీతలు, గొప్ప శాస్త్రవేత్తలు, అకాడమిషీయన్లు ఈ కాంగ్రెస్ లో పాల్గొంటున్నారు
  • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు వచ్చేవారెవరికీ ఏ లోటుపాట్లు లేకుండా వసతుల కల్పనకు చర్యలు
  • సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు, సైన్స్ కాంగ్రెస్ నిర్వాహకులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమావేశం

 

హైదరాబాద్, నవంబర్ 09 : ఉస్మానియా విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, నేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న  నోబెల్ పురస్కార గ్రహీతలు, శాస్త్రవేత్తలు, అకాడమిషీయన్లు పాల్గొనే ఈ సమావేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి గొప్పగా నిర్వహిస్తామన్నారు. 2018 జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో నేడు అధికారులతో సమీక్ష చేశారు. దీనిలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అచ్యుత సమంతా, చిల్ర్డన్ సైన్స్ కాంగ్రెస్ కన్వీనర్ డి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇక్కడ తొలిసారిగా నిర్వహిస్తున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న నేపథ్యంలో గతంలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకంటే ఘనంగా ఉండాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం గతంలో ఐదుసార్లు 1937,1954,1967, 1979, 1998లలో నిర్వహించినట్లు వీసీ రామచంద్రం సమావేశంలో తెలిపారు. ఇప్పటి వరకు చేరని వారిని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా చేరే నినాదం ( Reaching the Unreached through Science and Technology) తో ఈ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ లను కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నోబెల్ పురస్కార గ్రహీతల ఉపన్యాసాలుంటాయన్నారు. 14 థీమాటిక్ సెషన్లు ఉంటాయన్నారు.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, విద్యా సంస్థల్లో పూర్తి స్థాయిలో అకాడమిక్ వాతావరణం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా ఈ సమావేశాల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్ట పెరిగేలా ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలుండాలని ఆకాంక్షించారు. సమావేశాల నిర్వహణలో నిధుల కోసం ఆలోచించాల్సిన పనిలేదని, కావల్సినంత మొత్తాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కొత్త శోభ వచ్చిందని, ఈ సమావేశాలతో అది మరింత పెరగాలని సూచించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా పచ్చదనం, పరిశుభ్రత పటిష్టంగా నిర్వహించాలని, సమావేశాలనాటికి ఇంకా పెంపొందించాలన్నారు. ఇందుకోసం అవసరమైతే జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకోవాలన్నారు.

105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి వచ్చే అతిథులంతా ఆయారంగాల్లో నిష్ణాతులు కావడంతో వారికిచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే అతిథుల్లో చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి రావడం మొదటి సారి కానుండడంతో తెలంగాణ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా, హైదరాబాద్, తెలంగాణ ప్రసిద్ధ ప్రాంతాలు సందర్శించేలా వసతులు కల్పించాలన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి తెలియజేసే సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాలన్నారు.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, మన గవర్నర్ నరసింహ్మన్, ముఖ్యమంత్రి కేసిఆర్,  ఇతర రాష్ట్రాల మంత్రులు హాజరవుతున్నందున ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు పకడ్భందీగా ఉండాలన్నారు. ఏ ఒక్క పొరపాటు జరగకుండా ముందే పక్కా ప్రణాళికలు రూపొందించుకుని వసతులు కల్పించాలన్నారు. సైన్స్ కాంగ్రెస్ సమావేశాల బ్రోచర్లు, కరపత్రాలు, ప్రచారాలు విద్యా సంస్థలు, విద్యావేత్తలు, అనుబందంగా ఉన్న అందిరికీ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. విదేశాల నుంచి వచ్చే నోబెల్ పురస్కార గ్రహీతలు, శాస్త్రవేత్తలకు ఇక్కడ భాష పరంగా, వసతుల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *