1000 కోట్లతో క్లీన్ సిటీగా హైదరాబాద్

-మే 16 నుంచి స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమం
-గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌ : నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రూపకల్పన చేశారు. రూ. 1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ను క్లీన్‌సిటిగా మార్చనున్నారు. స్వచ్చ తెలంగాణ – స్వచ్చ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ప్రజలందరి విస్త్రుత భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఓ ప్రజా ఉద్యమం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ,జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలిస్‌్‌ కమిషనర్లు మహెందర్‌ రెడ్డి, ఆనంద్‌, జిహెచ్‌ఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్‌ నగరాన్ని మొత్తం 400 ముక్కలుగా విభజిస్తారు. ఒక్కో ముక్కకు ఒక్కో బాధ్యుడిని నియమిస్తారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన అధికారులు ఒక్కో భాగానికి ఇంచార్జిగా వ్యవహరిస్తారు. ఈ ఇంచార్జిలు ఒక్కొక్కరు కిలోమీటరున్నర వ్యాసార్థంలో బాధ్యతలు తీసుకుంటారు. సామాజిక బాధ్యత కలిగిన 15 మంది స్థానికులతో కమిటిని వేసుకుంటారు. ఇలా 400 భాగాలు కలిపి మొత్తం 6,000 మంది స్వచ్చ హైదరాబాద్‌ కార్యక్రమ నిర్వహణను భుజానికెత్తుకుంటారు. ఇంచార్జిగా వ్యవహరించే ముఖ్యుడు స్థానిక ప్రజలను చైతన్య పరిచి తమ బస్తీల్లో , తమ కాలనీల్లో, వీధుల్లో, వివిధ ప్రాంగాణాల్లో పరిశుభ్రత కోసం చేపట్టాల్సిన చర్యలను రూపొందిస్తారు. భవిష్యత్తులో వారు నిర్వహించుకునే పధ్దతులపై కార్యాచరణ రూపొదిస్తారు. ప్రభుత్వం నుండి ఏమి కావాలో కూడా నివేదిస్తారు. జిహెచ్‌ఎంసి వారికి కావలసిన సదుపాయాలు సమకూరుస్తుంది. ఇంచార్జ్‌, కమిటి సభ్యులు తమ పరిధిలోని ప్రాంతమంతా కలియతిరుగుతారు. ఆ ప్రాంతంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడానికి ఏ చర్యలు తీసుకోవాలి, మురికి కాలువల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం, మూత్రశాలల ఏర్పాటు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం, వీధుల నిర్వహణ, పార్కుల నిర్వహణ, డంపింగ్‌ యార్డుల పరిస్థితి, మెరుగైన చెత్త సేకరణ పద్దతులు తదితర విషయాలపై దృష్టి పెడుతుంది. పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం ఏమి చేయాలి? ప్రజలు ఏమి చేయాలి? అనే విషయాలను నిర్దారిస్తారు. అవసరమైన పనులు చేయడానికి జిహెచ్‌ఎంసి ద్వారా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఆయా ప్రాంతల్లోని కమిటీలు సంబంధిత పనులు చేయించుకోవాలి.
హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే కాదని, నగర వాసులందరి విస్త్రుత భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్య పరచడానికి, వారిలో స్పూర్తి నింపడానికి సినీ నటులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులను కూడా రంగంలోకి దించుతామన్నారు. సాంస్క­­ృతిక సారథి కళాబృందాలు కూడా నగరమంతా ప్రదర్శనలు నిర్వహిస్తాయన్నారు. ఇందుకు అవసరమైన పాటలు, ఇతర కళారూపాలను తయారు చేయాల్సిందిగా సాంస్క­­ృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వచ్చ హైదరాబాద్‌పై విస్త్రుత ప్రచారం కల్పించడానికి పేపర్లు, టివీలు, థియెటర్లు, రేడియో, ఆర్‌టిసి బస్సులు, ఆటోలు, హోర్డింగ్స్‌, కరపత్రాలు, వాల్‌ పోస్టర్లు లాంటి సాధానాలన్నింటిని ఉపయోగించుకోవాలని సిఎం చెప్పారు. ట్రాఫిక్‌ మినహా అన్ని విభాగాల పోలీసులందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సైనికులు, రైల్వే ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వివిధ కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థలు, మల్టిఫ్లెక్సులు, హాస్పిటల్స్‌, ఐటి కంపెనీలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ముందుగా ఇంచార్జులు, కమిటి సభ్యులకు మే 6న ఒకరోజు అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తారు. మే 16 నుండి 20 వరకు స్వచ్చ హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. 16న గవర్నర్‌ నరసింహన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *