
హరితహారంలో భాగంగా నగరంలోని కాలనీలు, బస్తీల్లో మొక్కలు నాటడానికి స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీలను భాగస్వాములను చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలియజేశారు. నగరంలోని పలు కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలో మొక్కలను నాటడంతో పాటు వాటి సంక్షరణ బాధ్యతను సంబంధిత కాలనీ సంక్షేమ సంఘాలకు అప్పగించాలని సూచించారు. ముఖ్యంగా రహదారుల వెంట నాటే మొక్కల సంరక్షణకు ట్రీ గార్డ్లను సీ.ఎస్.ఆర్ కింద సేకరించాలని సూచించారు. ఇప్పటి వరకు నగరంలో దాదాపు ఏడున్నర లక్షలకు పైగా మొక్కలను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న 34 నర్సరీలలో అందుబాటులో ఉన్న మొక్కల వివరాలను స్థానికులకు తెలియజేయాలని, ఆ సమాచారం ఆధారంగా తమకు కావాల్సిన మొక్కలను పొందే అవకాశం ఉంటుందని కమిషనర్ సూచించారు. కాగా నగరంలో పలువురు శాసన సభ్యులు, కార్పొరేటర్లు, అధికారులు నేడు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటడంతో పాటు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావులతో పాటు పలువురు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొన్నారు.