
హైదరాబాద్, ప్రతినిధి : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్థరాత్రి నుండే క్రిస్మస్ హడావుడి నెలకొంది. పలు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అర్థరాత్రి నుంచే చర్చిల వద్దకు చేరుకున్న క్రైస్తవులు ఆనందోత్సహాల మధ్య క్రీస్తు జన్మదినాన్ని జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. క్రిస్మన్ను పురస్కరించుకుని చర్చిలన్నీ కిక్కిరిసాయి. కీర్తనలతో ప్రతిధ్వనించాయి. రంగురంగుల దీపాలతో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగాను నిలిచాయి.
తెలంగాణలో…
జంట నగరాలలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. నగరంలోని పలు చర్చీలు విద్యుత్ కాంతుల అలంకరణతో వెలుగునీయగా నగర వీధుల్లో క్రిస్మస్ శోభ సంతరించుకున్నాయి. హైదరాబాద్ మియాపూర్లో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కల్వరి చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు నగరవాసులే కాకుండా పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. క్రీస్తు జనన విధానాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మెదక్ లో..
ఇక ఆసియాలోనే ప్రఖ్యాత గాంచిన మెదక్ జిల్లాలోని కేథడ్రల్ చర్చి.. క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాల అలంకరణతో ప్రార్థనా మందిరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. అర్థరాత్రి నుంచే భారీగా చేరుకున్న భక్తులు దైవప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరుల గీతాలాపన, ఆరాధన కార్యక్రమాలతో చర్చి మార్మోగింది. జిల్లానుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.