హ్యాట్సాఫ్ సుధాకర్

అందరికంటే ముందు సమాచారాన్ని సేకరించాలనే తాపత్రయంతో
బైట్ ల కోసం, విజువల్స్ కోసం, ఫోటోల కోసం హంగామా సృష్టించే నేటి పోటీ మీడియా ప్రపంచంలో… వాటికి భిన్నంగా, తోటి మనుషుల ప్రాణాలే ముఖ్యమని భావించి, సాహసాన్ని ప్రదర్శించి, పలువురు విద్యార్థినీలను ప్రాణాపాయం నుండి రక్షించి మానవత్వాన్ని చాటుకున్న ఆదర్శ జర్నలిస్ట్ అతను…
పూర్తి వివరల్లోకెళ్తే……
జులై 14, రాత్రి 11.30 గంటలు..
అంతకుముందు కురిసిన వర్షం అప్పుడే ఆగింది. ఖమ్మం పట్టణంలోని బురహాన్ పురలో గల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం(ఎస్సీ హాస్టల్)లో 5వ, తరగతి నుండి 8వ, తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థినీలు గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు…అదే సమయంలో హఠాత్తుగా షాక్ సర్క్యూట్ తో పొగ మంటలు చెలరేగుతున్నాయి… పదకొండేళ్ల స్పందన అనే చిన్నారి ఆ మంటల్లో చిక్కుకొని అక్కడికక్కేడే మృతి చెందింది..తమను రక్షించండి అంటూ హాస్టల్ గదిలో ఇరుక్కుపోయిన మిగితా 13 మంది ఆడపిల్లల అర్ధనాదాలు… హాస్టల్ లో పొగలు వస్తున్న విషయాన్ని అదే బస్తీలో నివాసముంటున్న 99టీవీ వీడియో జర్నలిస్టు సుధాకర్ కు ఎవరో సమాచారం అందించారు. విధి నిర్వహణలో భాగంగా విజువల్స్ కోసం కెమెరా తీసుకొని పరుగులు తీసిన సుధాకర్ అక్కడి పరిస్థితిని గమనించి, తనకు విజువల్స్ కన్నా, అక్కడ ప్రాణాపాయస్థితిలో కొట్టి మిట్టాడుతున్న ఆడపిల్లల ప్రాణాలు కాపాడడమే ముఖ్యమని భావించాడు. వెంటనే తన కెమెరాను ప్రక్కనబెట్టి, తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా హాస్టల్ లోకి చొచ్చుకెళ్లిపోయి విద్యార్థినీలను ఒక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అంతటితోనే అతను ఊరుకోలేదు. పొగల్లో ఇరుక్కుపోయి ఊపిరిపీల్చలేక ఇబ్బంది పడుతున్న ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ కోసం ఫోన్ చేయగా రెస్పాన్స్ రాలేదు. వెంటనే ఆ ఇద్దరిని తన భుజాలమీద మోసుకొని ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడగలిగాడు. జర్నలిస్ట్ సుధాకర్ సాహసం, మానవత్వం తోటి జర్నలిస్టులకే కాకుండా యావత్తు సమాజానికే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కాంక్షిస్తున్నాను. సుధాకర్ లాంటి ఆదర్శ జర్నలిస్టు
మా టీయుడబ్ల్యుజె సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగడం పట్ల గర్వపడుతూ, అతనిని అభినందిస్తున్నాను.

sudhaker 1       sudhaker 2

టీయుడబ్ల్యుజె సత్కారం
—————————-
ఆదర్శ వీడియో జర్నలిస్ట్ సుధాకర్ ను శనివారం నాడు బషీర్ బాగ్ లోని టీయుడబ్ల్యుజె కార్యాలయం ఆడిటోరియంలో ఘనంగా సత్కరించాము. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో జాతీయ నాయకులు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అమర్ నాథ్, కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు విష్ణుదాస్ శ్రీకాంత్, రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అభినందనాలతో…..
కె.విరాహత్ అలీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(,టీయుడబ్ల్యుజె)

sudhaker 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *