
-ప్రముఖ అర్కిటెక్ట్ హఫీజ్ కు బాధ్యతలు
హైదరాబాద్ , ప్రతినిధి : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం కేసిఆర్ హైదరాబాద్‌ను ప్రపంచంలో మేటి నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసారు. ఆ దిశగా ఆయన పనులను వేగవంతం చేసారు. హైదరాబాద్‌లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో కేసిఆర్ సమావేశమై చర్చించారు. పలు నిర్మాణాలపై మ్యాప్‌లను పరిశీలించారు.గూగుల్ ఎర్త్ ద్వారా కొత్త కట్టడాల కోసం ప్రాంతాలను గుర్తించారు.
కళాభారతి పేరుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్..
ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కళాభారతి పేరుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని సీఎం సూచించారు. నాలుగు ఆడిటోరియాలు, విశాలమైన పార్కింగ్ ఏరియా ఉండే విధంగా డిజైన్ తయారు చేయాలని చెప్పారు. మూడువేలు, 15వందలు, వెయ్యి, ఆరువందల మంది వరకు పట్టేలా ఇలా ఆడిటోరియాలు నిర్మించాలని ఆదేశించారు. రవీంధ్ర భారతి ప్రాంతంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలు చాటే విధంగా ఓప్రత్యేక కట్టడం రావాలని కేసిఆర్ సూచనలు చేశారు.
మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు ప్రణాళికలు..
మొజాంజాహీ మార్కెట్, చార్మినార్, హుస్సేన్ సాగర్, సాలార్జంగ్ మ్యూజియం వంటి చారిత్రాత్మక ప్రాంతాల ప్రాముఖ్యత దెబ్బతినకుండా వాటికి అనుబంధంగా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలని కేసిఆర్ సూచించారు. మూసీ నదికి రెండువైపులా అద్భుతమైన పార్కులు, పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నదీ ప్రాంతం నుంచి చాదర్‌ఘాట్, బాపుఘాట్ దాకా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పనుల కోసం ప్రణాళికలు తయారుచేయాలన్నారు. సాలార్జంగ్ మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయి మ్యూజియంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
మల్టీ లేయర్ ఫ్లై ఓవర్ల నిర్మాణం..
నగరంలోని ట్రాఫిక్‌కు అనుగునంగా మల్టీలేయర్ ఫ్లై ఓవర్లు నిర్మించాలని కేసిఆర్ సూచించారు. యాదగిరిగుట్ట, జహంగీర్ గుట్ట దర్గాలను తీర్చిదిద్దాలని ప్రత్యేక బృందానికి తెలిపారు. ప్రపంచంలోని ప్రతి పౌరుడు తప్పకుండా సందర్శించాలనుకునే నగరాల్లో హైదరాబాద్ శాశ్వతంగా ఉండిపోవాలని పేర్కొన్నారు. దానికనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని హఫీజ్ బృందానికి కేసీఆర్ సూచనలు చేశారు.