హైదరాబాద్ వదులుకుంటే 12 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేది..

అస్తవ్యస్తంగా, అడ్డదిడ్డంగా తయారయిన హైదరాబాద్‌లో పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు కొత్తగా విస్తరిస్తున్న నగర ప్రాంతం క్రమ పద్దతిలో ఉండే విధంగా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని తెలంగాణకు దక్కించుకోవడానికి చాలా పోరాటం చేయాల్సి వచ్చిందని, అలాంటి నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. నగరంలో భూముల క్రమబద్దీకరణ, అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ, కొత్త నివాసాలకు అనుమతులు ఇచ్చే విధానం, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి సంస్థల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
డిప్యూటి సిఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, పద్మారావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, స్టీఫెన్‌సన్‌, కృష్ణారావు, ఏనుగు రవీందర్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ.గోపాల్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌, హెచ్‌ఎండిఎ కమిషనర్‌ శాలినిమిశ్రా, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి ఎండి జగదీశ్‌, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, హౌసింగ్‌ కార్యదర్శి దానకిషోర్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
“తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ గురించే చర్చ జరిగింది. హైదరాబాద్‌ లేకుండా తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదని ఆంధ్ర నాయకత్వం కూడా అంగీకరించింది. కానీ నేను ఒప్పుకోలేదు. హైదరాబాద్‌ విషయంలో రాజీ పడేది లేదని చెప్పాను. హైదరాబాద్‌ లేని తెలంగాణ కావాలంటే 12 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేది. కానీ హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని పోరాడినం. ఆలస్యం జరిగినా అనుకున్నది సాధించాము. చావు మీదికి తెచ్చుకుని మరీ గుండెకాయలాంటి హైదారాబాద్‌ను దక్కించుకున్నాము. హైదరాబాద్‌తో పాటు మనకు వారసత్వంగా గత పాలకులు అనుసరించిన విధానాల పాపాలు కూడా వచ్చాయి. హైదరాబాద్‌ను ఆంధ్రపాలకులు మనది అనుకోలేదు. భావితరాల గురించి వారు ఆలోచించలేదు. అందుకే అక్రమ నిర్మాణాలు యథేచ్చగా ఉన్నాయి. ఎక్కడ చూసినా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. అడ్డగోలు విధానాలు అవినీతికి ఆస్కారం కల్పించే విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షించుకుంటూ నగరాన్ని తీర్చిదిద్దుకోవాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
“అక్రమంగా వెలిసిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా కట్టిన కట్టడాల గురించి సమీక్షించాలి. వాటిని కూలగొట్టడం ఉపయోగమా? క్రమబద్దీకరించడం ఉపయోగమా? వాటి పర్యవసానాలు ఏమిటి? అనే విషయంపై అన్ని కోణాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకోవాలి. భూముల క్రమబద్దీకరణ విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరగాలి. భవిష్యత్తులో మళ్లీ అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు జరుగకుండా పటిష్టమైన విధానం రూపొందించాలి. బిఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పై సరైన నిర్ణయం తీసుకోవడానికి అధికారులు తగు సిఫారసులు చేయాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ల్యాండ్‌ అండ్‌ బిల్డింగ్‌ పాలసీని తీసుకురావలసిన అవసరం ఉంది. హైదరాబాద్‌ నగరంలో గృహనిర్మాణ రంగం బాగా అభివృద్ది చెందుతోంది. బిల్డర్లను కూడా ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది. గృహ నిర్మాణ రంగంలో అవినీతిని నిరోధించాలి. నగర పాలన విషయంలో కీలకంగా ఉన్న జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హెచ్‌ఎండబ్లుఎస్‌ఎస్‌బి లాంటి సంస్థల ప్రస్తుత పనితీరును అధ్యయనం చేసి భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా నిర్ణయించాలి. ఎంత జాగాలో ఎన్ని అంతస్థుల భవనానికి అనుమతి ఇవ్వవచ్చు అనే విషయంలో కూడా శాస్త్రీయంగా, వాస్తవికంగా ఓ నిర్ణయానికి రావాలి. నగరంలో నిరుపేదల కోసం ఇంటి నిర్మాణం జరిపే విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. వివాదాల పరిష్కారం కోసం జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎలు లీగల్‌ అడ్వైజర్‌లను, సీనియర్‌ లాయర్లను నియమించుకోవాలి. అక్రమాలకు తావు లేకుండా ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ నిఘా ఏర్పాటు చేయాలి. రాజీవ్ స్వగృహ లాంటి పథకాల ద్వారా కట్టిన ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి. వాటి కోసం ప్రభుత్వం కిస్తీలు చెల్లించాల్సి వస్తున్నది. వాటిని అవసరమైన వారికి ఇచ్చి ఉపయోగంలోకి తేవాలి. మంత్రులు నగరంపై మరింత దృష్టి పెట్టాలి. తలసాని శ్రీనివాసయాదవ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయపరిచే బాధ్యతను స్వీకరించాలి” అని ముఖ్యమంత్రి అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.