
హైదరాబాద్, ప్రతినిధి : దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దీంతో నగరంలో మహిళలకు భద్రత కల్పించే విషయంలో తెలంగాణ సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. ప్రైవేట్ క్యాబ్‌లలో తరచూ అత్యాచారాలు జరుగుతుండటంతో, హైదరాబాద్‌లో ‘షీ క్యాబ్స్’ ను ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా మహిళా డ్రైవర్ల కోసం ఓ కమిటీని వేసింది. ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో షీ టాక్సీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జంట కమిషనరేట్ల పరిధిలో ప్రభుత్వం వీటిని ముందుగా ప్రవేశపెట్టనుంది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈ స్కీమ్ విధివిధానాలను రూపొందించేందుకు ట్రాన్స్ పోర్ట్ కమిషన్ ఛైర్మన్, నలుగురు సభ్యులతో కమిటీని వేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాఫిక్ డీసీపీ, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక డైరెక్టర్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. షీ ట్యాక్సీల నిర్వహణ, డ్రైవర్ల ఎంపిక, ఏ రూట్లలో ఈ ట్యాక్సీలు నడపాలనే విషయాలపై కమిటీ నివేదిక తయారు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఓ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
రుణ సౌకర్యం కల్పించనున్న ప్రభుత్వం…
షీ ట్యాక్సీలు నిలిపి ఉంచే ప్రాంతాల్లో మహిళా డ్రైవర్లకు అన్ని రకాల వసతులు ఉండేలా ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ఇందుకోసం కొన్ని సెంటర్లను ఎంపిక చేసే బాధ్యతలను కూడా కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ ట్యాక్సీల కోసం ప్రభుత్వమే రుణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం బ్యాంకులతో ఒప్పందం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేకాదు షి ట్యాక్సీ స్కీం కింద 35 శాతం సబ్సిడీని కూడా ఇవ్వనున్నారు. ఐటీ పరిశ్రమ ఉన్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోనున్నారు.
నెల రోజుల్లోనే అమలు
షీ ట్యాక్సీ పథకాన్ని నెల రోజుల్లోనే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే ప్రైవేట్ ట్యాక్సీలు నడుపుతున్న సంస్థల పనితీరును అధ్యయనం చేయాలని కూడా కమిటీ భావిస్తోంది.