
హైదరాబాద్, ప్రతినిధి : వాళ్లు క్రిమనల్స్ కాదు.. పెద్ద పెద్ద నేరాలు చేయలేదు.. పైగా రోడ్డు ప్రమాద బాధితులు అయినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదరగొడుతున్న హైదరాబాద్ పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టారు. బైక్‌పై పడిపోయిన దంపతులపై లాఠీ ఝుళిపించడంతోపాటు రాత్రంతా స్టేషన్‌లోనే వుంచి నరకం చూపించిన ఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
జ్యోతి అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి రాత్రి స్కూటీపై వెళ్తుండగా అమీర్‌పేట్ సమీపంలోని గ్రీన్‌ల్యాండ్ హోటల్ వద్ద పడిపోయారు. మ్యాన్‌హోల్ లోకి స్కూటీ వెళ్లడంతో భార్యభర్తలిద్దరితోపాటు బాబు కూడా కిందపడిపోవడంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. దీంతో జ్యోతి, ఆమె భర్త ఇద్దరు స్కూటీ ఆపి నిరసన వ్యక్తంచేశారు. అక్కడేవున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్లపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. దీంతో దంపతులిద్దరు అతనిపై పంజాగుట్టు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఐతే, ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఆ దంపతులపై రివర్స్ కేసు పెట్టాడు. మరోవైపు దెబ్బలు తగిలిన ఆ దంపతుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీసులు అలాగే స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అర్థరాత్రి దాటాక భర్తను స్టేషన్‌లో వుండమని, భార్యను మాత్రం ఇంటికి వెళ్లమన్నారు. జ్యోతి మాత్రం ఇంటికెళ్లేదిలేదని అక్కడే కూర్చుంది. తమపై దాడి చేసిన కానిస్టేబుల్‌ను ఏమీ అనకుండా తమనే రాత్రంతా స్టేషన్‌లో కూర్చోబెట్టడం ఏంటంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.