
జమ్మూ, ప్రతినిధి : జమ్మూకాశ్మీర్ పాలిటిక్స్ డెస్టినీకి చేరడంలేదు. పొత్తంటారు అంతలోనే ఏం లేదంటున్నారు. ఏం చేస్తారో పార్టీలకే క్లారిటీలో లేకపోవడంతో… జనాల్లో మరింత కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఇదే టైమ్ లో మరో ట్విస్ట్ వచ్చి పడింది. పార్టీల మధ్య అనైక్యతతో జమ్మూకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన వైపు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమున్నా… పొత్తులు కుదరడంలేదు. పీడీపీ-బీజేపీల మధ్య చర్చలు మూడడుగులు ముందుకు… ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతుండటంతో ఆపద్దర్మ సీఎంగా కొనసాగలేనంటున్నారు ఒమర్ అబ్దుల్లా . తనను పదవి నుంచి తప్పించాలని గవర్నర్ ను కోరారు. దీంతో గవర్నర్ వోహ్రా మూడు ప్రతిపాదనలతో కేంద్రానికి రిపోర్ట్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు.
అటు పీడీపీపై విమర్శలు గుప్పించారు ఒమర్. 28 ఎమ్మెల్యేలు ఉండి రెండు పార్టీలు మద్దతిస్తామని చెప్పినా ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలేదని ట్విట్టర్ లో ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం పీడీపీ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నెల 18 వరకు జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి గడువు ఉంది. అయితే ఒమర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించడం, ప్రభుత్వ ఏర్పాటు ఎటూ తేలకపోవడంతో గవర్నర్ వోహ్రా.. తాజా పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపించారు. ఇప్పుడు కాశ్మీర్ రాజకీయం కేంద్రం కోర్టులోకి చేరింది. దీనిపై సెంట్రల్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి.