
ఢిల్లీ , ప్రతినిధి : 2013 నవంబర్లోనే కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల్లో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న మూడు రాష్ట్రాల సమస్య, నాలుగు రాష్ట్రాల సమస్యగా మారింది. దీంతో ట్రిబ్యునల్ పరిధి, జలాల పునః కేటాయింపులపై సమావేశం వాడీవేడీగా సాగింది.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా
మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన జలాలనే తెలుగురాష్ట్రాలకు పంపిణీ చేయాలని మహారాష్ట్ర, కర్నాటకలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిబ్యునల్‌ను రద్దుచేసి కొత్తది ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. మరోపక్క రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి తీరుతామని ఏపీ స్పష్టం చేసింది. ఇలా నాలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు. జలజగడం ముదురుతుండటంతో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. నాలుగు రాష్ట్రాల వాదనలు తెలుసుకుని ట్రిబ్యునల్ తన అభిప్రాయం చెప్పనుంది. వాదనలు వినిపించేందుకు ట్రిబ్యునల్ 9 అంశాలను రూపొందించింది. ఫిబ్రవరి 25, 26, 27న తమ వాదనలు వినిపించనున్నాయి.
నీటి హక్కులపై ఉత్కంఠ
ఇప్పటి వరకు కృష్ణాపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్యే వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్మట్టి సమస్య ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఆల్మట్టి ఎత్తును కర్ణాటక పెంచుకుంటూ పోతోంది. కర్నాటక, మహారాష్ట్రలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం… తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సైతం ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో… ట్రిబ్యునల్ ఒక నిర్ణయానికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి నాలుగు రాష్ట్రాలతో చర్చించిన తర్వాత నీటి హక్కులు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.