
మెదక్ ఉప ఎన్నికలో తెరాస ప్రచారం జోరు మీదుంది. హరీష్ రావు ఒంటి చేత్తో చక్రం తిప్పుతూ పార్టీ కేడర్ ను జోష్ తో ముందుకు నడిపిస్తున్నారు. తన పార్టీ వారిని ఉత్తేజ పరచడం, ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకు పడటం అనే విషయలో హరీష్ సమర్థంగా వ్యవహరిస్తున్నారు.
సిద్దిపేట సెగ్మెంట్ తో పాటు నియోజకవర్గం మొత్తం హరీష్ వ్యూహం మేరకు తెరాస శిబిరం ప్రచార పర్వంలో బిజీగా ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలపై విమర్శల దాడి విషయంలో హరీష్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీజేపీ, టీడీపీలపై విరుచుకు పడుతున్నారు.
దమ్ముంటే ప్రచారానికి వచ్చి గెలిపించుకోవాలంటూ చంద్రబాబును కూడా చాలెంజ్ చేశారు. చంద్రబాబు వస్తే బీజేపీకి ఓట్లు రావంటూ టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని హరీష్ సవాలు విసిరారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన సవాలుకు సిద్ధమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దూకుడుగా జవాబివ్వక పోతే వారు భయపడుతున్నారని ప్రచారం చేయడం తెరాస వ్యూహం.
అధికార పార్టీగా ఆపరేషన్ ఆకర్షను విజయవంతంగా తెరాస కొనసాగిస్తోంది. పెద్ద సంఖ్యలో చేరే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు అదనపు బలంగా మారుతున్నారు. ఈ ఆకర్స్ కారణంగా గులాబీ శ్రేణులు ఫుల్ జోష్ మీదున్నాయి. దీంతో దూకుడుగా ముందుకు పోవడం హరీష్ మరింత సులువు అవుతోంది. ఈసారి కూడా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించడం హరీష్ లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఆ రికార్డును సాధిస్తారా అనేది చూడాలి.