హరిత హరం వేగం పెంచండి

కరీంనగర్: రాష్ట్ర్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో వేగం పెంచి జిల్లాలో విరివిగా మొక్కలు నాటి లక్ష్యాన్ని సాధించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేటు నుండి జిల్లాలోని అందరు తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లతో హరితహరం కార్యక్రమం అమలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం వరకు 1.81 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. జిల్లాలోని వివిధ నర్సరీలలో ఇంకను 1.70 కోట్ల వివిధ రకాల మొక్కలు నాటుటకు సిద్దంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంబంధిత మండలాల అధికారులు నర్సరీలకు వెళ్లి మొక్కలు తీసుకోవచ్చునని తెలిపారు. మొక్కలు నాటుటకు వీలుగా ఉపాధి హమి పధకం ద్వారా గుంతలు తవ్వించాలని ఆదేశించారు. జిల్లాలోని 6 వేల పంచాయితీరాజ్ రోడ్లకు ఇరు పక్కల మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో 3 లక్షల టేకు మొక్కలు సిద్దంగా ఉన్నాయని వెంటనే వాటిని నాటించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటుట ఆగిపోవద్దని జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని మొక్కలు నాటుటకు అనువైన కాలమని నాటిన ప్రతి మొక్క
బతికే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ స్ధలాలలో సాముహిక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని వాటి రక్షణకు బోర్ వెల్ మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, సంస్ధలలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో28 మండలాల నుండి హరితహరం మండల ప్రణాళికలు అందలేదని వెంటనే పంపించాలని ఆదేశించారు. అలాగే గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో పశ్చిమ, తూర్పు డిఎఫ్ఓలు వినోద్ కుమార్, రవికిరణ్ డ్వామా పిడి వెంకటేశ్వర రావు, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్య, పంచాయితీ రాజ్ ఎస్.ఇ. దశరధం, జిల్లా పరిషత్ సిఇఓ సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *