హరితహారం భాగస్వామ్య శాఖలతో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారుల సమీక్ష

అందరి భవిష్యత్ కోసం సీ.ఎం ఆకుపచ్చని రాష్ట్రం కల కంటున్నారు

దానిని నిజం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రతీ పౌరుడిది

నాలుగో విడత విజయవంతం చేయాలి, వచ్చే యేడాది కోసం వంద కోట్ల మొక్కలు పెంచాలి

గ్రామ పంచాయితీకి ఒకటి చొప్పున, పట్టణ ప్రాంతాలతో కలిపి పది వేల దాకా నర్సరీలు

హరితహారం భాగస్వామ్య శాఖలతో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారుల సమీక్ష

మరి కొద్ది రోజుల్లో నాలుగో విడత హరితహారం మొదలు కాబోతున్న నేపథ్యంలో సంబంధిత శాఖలతో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హరితహారం ఏర్పాట్లను సమీక్షించటంతో పాటు, వచ్చే యేడాది కోసం వంద కోట్ల మొక్కలు నాటే భారీ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్దేశించటంతో అందుకు అవసరమైన సన్నాహాకాలపై కూడా సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కే.భూపాల్ రెడ్డి, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, హెచ్ ఎం డీ ఏ కమిషనర్ చిరంజీవులు, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, మున్సిపల్ శాఖ కమిషనర్ టి.కే. శ్రీదేవి, పీసీసీఎఫ్ పీ.కే.ఝా, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్, జీ హెచ్ ఎం సీ, హెచ్ ఎం డీ ఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. నాలుగో విడత హరితహారం త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని, మంచి వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని జిల్లాల్లో హరితహారం ఊపందుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాల వారీగా హరితహారం చేపట్టాల్సిన ఖాళీ స్థలాలను గుర్తించటం, పిట్స్ ( గుంతలు) తవ్వించటం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇక వచ్చే యేడాది నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని వంద కోట్లుగా సీ.ఎం నిర్ణయించటంతో, తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, అటవీ, మున్సిపల్, పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ప్రతీ గ్రామ పంచాయితీ ఒక నర్సరీ తప్పని సరిగా ఏర్పాటు చేయాలని, అలాగే మున్సిపల్, కార్పోరేషన్ పరిధిలో వార్డుకు ఒకటి చొప్పున నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనాభా ఆధారంగా గ్రామీణాభివృద్ది కింద 5,750 నర్సరీలు, 2,250 పట్టణ ప్రాంతాల్లో, 2,200 అటవీ శాఖ ఆధీనంలో మొత్తంగా సుమారు పది వేల దాకా నర్సరీలను వచ్చే యేడాది హరితహారం కోసం సిద్దం చేయాలని నిర్ణయించారు. ఇక వంద కోట్ల మొక్కల లక్ష్యంలో భాగంగా గ్రామీణాభివృద్ది శాఖ నర్సరీల్లో 65 కోట్ల మొక్కలు, మున్సిపల్ శాఖ పరిధిలో 25 కోట్ల మొక్కలు ( హెచ్ ఎం డీ ఏ – 7 కోట్లు, జీ హెచ్ ఎం సీ 3 కోట్లు, ఇతర మున్సిపాలిటీల్లో 15 కోట్ల మొక్కలు), మిగతా పది కోట్ల పెద్ద మొక్కలు అటవీ శాఖ పరిధిలో పెంచేలా మౌళిక సదుపాయాలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కే. భూపాల్ రెడ్డి సూచించారు. నాలుగో విడతతో పాటు, కొత్త నర్సరీల ఏర్పాటుపై రేపు చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల నుంచి జిల్లా ఇంఛార్జి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *