
ముఫ్పై రెండు కోట్ల మొక్కలు నాటి, నలభై కోట్ల దిశగా అడుగులు.
ప్రారంభమైన మూడేళ్ల నుంచి నాటిన మొక్కలు ఈ యేడాదే అత్యధికం.
మొక్కలు నాటడంలో వంద శాతం టార్గెట్ ను సాధించిన పది జిల్లాలు.
ఎల్లుండి (27) నుంచి పాడి రైతులతో హరితహారం, సుమారు 12 లక్షల మొక్కలు నాటే
లక్ష్యం.
ఆకు పచ్చ రాష్ట్ర సాధనే లక్ష్యంగా మొదలైన తెలంగాణకు హరితహారం మరో వినూత్నరికార్డును సాధించింది. పథకం ప్రారంభమైన మూడేళ్లలో ఈ యేడాది అత్యధిక మొక్కల లక్ష్యాన్ని చేరుకుంది. ఈ యేడాది నలభై కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా జూలై 12 న కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడో విడత హరితహారం ప్రారంభమైంది. ఈ మూడు నెలల కాలంలో మంచి వర్షాలకు తోడు, ప్రజా సంకల్పం, అటవీ శాఖకు తో పాటు
అన్ని శాఖల సమన్వయం, అధికారుల కృషి మూలంగా ముఫ్పై రెండు కోట్లకు పైగా మొక్కలు నాటడంతో పాటు, బృహత్తర కార్యక్రమంగా కొనసాగుతూనే ఉంది. దీనిని ఇలాగే కొనసాగించి మరో ఎనిమిది కోట్ల మొక్కలు నాటి ఈ యేడాది నలభై కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పచ్చదనాన్ని ప్రస్తుతం ఉన్న 24 నుంచి మరో తొమ్మిది శాతం పెంచి 33 శాతం సాధించటమే లక్ష్యంగా సీ.ఎం మానస పుత్రిక పథకంగా 2015 లో హరితహారం ప్రారంభమైంది. ఆ యేడాది వర్షాలు సరిగా అనుకూలించకపోవటంతో 15.86 కోట్లు మొక్కలు మాత్రమే నాటే వీలుకలిగింది. ఆ తర్వాతి ఏడాది 2016-17 సంవత్సరంలో అనుకూల రుతుపవనాలు, వర్షాలతో 31.67 కోట్లు మొక్కలు తెలంగాణ వ్యాప్తంగా నాటే వీలుకలిగింది. ఆ రెండేళ్ల ఇచ్చిన ఫలితాలు, అనుభవంతో ఈ యేడు మూడో విడతలో నలభై కోట్ల మొక్కల లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్థేశించారు. మొదట్లో రుతపవన విరామం కొంత ఇబ్బంది పెట్టినా, ఆ తర్వాత మంచి వర్షాలు కురవటంతో అటవీ శాఖ ఉత్సాహంగా హరితహారాన్ని చేపట్టింది. గత రెండేళ్ల రికార్డును దాటి ముఫ్పై రెండు కోట్ల
మొక్కలను నాటినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అక్టోబర్ లో కూడా హరితహారాన్ని కొనసాగించి మిగతా లక్ష్యాన్ని కూడా పూర్తి చేయాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్నఅధికారులకు దిశా నిర్దేశం చేశారు. మేడ్చెల్, వరంగల్ అర్బన్ ,
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ రూరల్, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఇప్పటికే వంద శాతం లక్ష్యాన్ని సాధించి, ఇంకా వీలున్న చోట మొక్కలు నాటే కార్యక్రమాన్నికొనసాగిస్తున్నాయి. మరో పదహారు జిల్లాల్లో లక్ష్యంలో 70 శాతానికి పైగా మొక్కలు నాటారు. పోలీస్ శాఖ తరుపున కూడా అధికారులు, సిబ్బంది ఈ సారి పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొన్నారు. ఇప్పటికే నాటిన మొక్కలకు తక్షణ రక్షణ, నీటి వసతి అవసరం అన్న ముఖ్యమంత్రి సూచనల మేరకు అటవీ, గ్రామీణాభివృద్ది శాఖలు పెద్ద ఎత్తున మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశాయి. ఓకే చోట పెద్ద సంఖ్యలో మొక్కలు నాటిన ప్రదేశాలకు ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన రహదారుల వెంట అమలు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ ( రహదారి వనాలు) మంచి ఫలితాలను ఇస్తోంది. అలాగే మొక్కల రక్షణ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు హరిత రక్షణ దళాలు ( గ్రీన్ బ్రిగేడ్ ) లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నాలుగు లక్షలా యాభై ఆరు వేలా ఏడు వందల నాలుగు (4,56,704) గ్రీన్ బ్రిగేడ్ లు ఏర్పాటై మొక్కల సంరక్షణ బాధ్యతను చూస్తున్నాయి. అలాగే నాటిన మొక్కలను అన్నింటినీ గూగుల్ మ్యాపులతో అనుసంధాన చేసే ప్రక్రియ జియో ట్యాగింగ్ కూడా కొనసాగుతోంది. ఇప్పటిదాకా నాటిన మొక్కల్లో 69 శాతం మొక్కలను జియో ట్యాగింగ్
చేశారు. ఈ ప్ర్రక్రియ ఇంకా కొనసాగుతోంది.