హరితహారంపై అన్ని జిల్లాల అటవీ, విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్

విద్యా సంస్థల్లో రెండు కోట్ల మొక్కలు నాటండి..స్థలం మేం చూపిస్తాం

విద్యాసంస్థల్లో 40 లక్షల మంది విద్యార్థులున్నారు…కోటి పండ్ల మొక్కలు వారికివ్వాలి

విద్యా సంస్థల్లో బ్లాక్ ప్లాంటేషన్, ప్రహరీ గోడలపక్కన మరో కోటిమొక్కలు నాటాలి

ప్రతి పాఠశాలవారిగా ప్రణాళిక ఉండాలి…పేపర్ల మీద మొక్కలు నాటడం వద్దు

ఫలితాలు కనిపించేలా, ఆచరాత్మక ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి

పాఠశాలల్లోని గ్రీన్ బ్రిగేడ్లకు ప్రత్యేక యూనిఫామ్ అందించండి

మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు బోర్లువేసి, పనిమనిషి పెట్టాలి

ప్రతి నాల్గో శనివారం స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల నిర్వహిస్తున్నాం

ఆహ్లాదకర వాతావరణం కావాలంటే పచ్చదనం, నీరు ఉండేలా చూడాలి

కొడకండ్ల, దండేపల్లి, సంగారెడ్డి స్కూళ్లు హరితహారంలో మోడల్ గా ఉన్నాయి

హరితహారంపై అన్ని జిల్లాల అటవీ, విద్యాశాఖ అధికారులతో సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి,
విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, జూలై 06 : నాల్గవ విడత హరితహారంలో భాగంగా విద్యా సంస్థల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ, అటవీశాఖ అధికారులకు లక్ష్యం నిర్ధేశించారు. విద్యాశాఖ పరిధిలోని పాఠశాల, ఉన్నత విద్య, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, బీ.ఈడి కాలేజీలు, డి.ఈడీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్శిటీలలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులున్నారని తెలిపారు. ఇందులో 25 లక్షల మందికి విద్యార్థికొక 5 పండ్ల మొక్కలు ఇచ్చి వాళ్ల ఇంటి ఆవరణలో నాటాలని ప్రోత్సహిస్తే దాదాపు కోటి 25 లక్షల మొక్కలు అవుతాయని అన్నారు. సగటున విద్యార్థుల ద్వారా కోటి పండ్ల మొక్కలు నాటేవిధంగా లక్ష్యం పెట్టుకుని, వారికి కోటి పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా యూనివర్శిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలున్నాయని వివరించారు. విద్యా సంస్థల్లో ఆటస్థలాలు మినహాయించి మిగిలిన ఖాళీ స్థలాల్లో కోటి మొక్కలను బ్లాక్ ప్లాంటేషన్ చేయాలన్నారు. ఈ విధంగా ఈ నాల్గవ విడతలో విద్యా సంస్థల్లో రెండు కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకుని దానిని అమలు చేయాలన్నారు. విద్యా సంస్థల్లో రెండు కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని పేపర్ల మీద సాధించడం కాకుండా, ఆచరించే విధంగా తద్వారా ఫలితాలు వచ్చే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు చెప్పారు.

ఈ ప్రణాళికలో ప్రతి పాఠశాల వారిగా, గ్రామాల వారిగా, మండలాల వారిగా, జిల్లాల వారిగా విద్యా సంస్థల్లో ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్న సమాచారం జిల్లా విద్యాధికారులు, అటవీ శాఖ అధికారుల వద్ద ఉండాలన్నారు. ఈ ఖాళీ స్థలాల్లో అర ఎకరంలో 400 మొక్కలు నాటవచ్చని, ఈ నాటిన మొక్కలు పరిరక్షించడానికి అటవీ శాఖ బాధ్యత తీసుకుని బోర్లు వేయించాలని, ఉపాధి హామీ పథకం కింద వాటి సంరక్షణకు ఒక మనిషిని ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యా సంస్థల్లో పర్యావరణంపై అవగాహన పెంచి, హరితహారాన్ని విజయవంతం చేయడంలో భాగంగా విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అటవీశాఖ, విద్యాశాఖ అధికారులను కొనియాడారు. అయితే ఈ విద్యార్థులకు మంచి యూనిఫామ్ అందించాలని, వారితో గ్రామాల్లో పర్యావరణంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి నాల్గవ శనివారం విద్యా సంస్థల్లో ఇప్పటికే తాము స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, పాఠశాలనంతటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో ఎక్కువగా బతుకుతున్న మొక్కల శాతం విద్యా సంస్థల్లోనే ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇటీవల తాను జనగామా జిల్లా కొడకండ్ల గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి రెసిడెన్షియల్ పాఠశాలలో వెయ్యి మొక్కలు నాటి వెయ్యి మొక్కలను పరిరక్షించారని, ఇప్పుడు పాఠశాలంతా పచ్చదనంతో పర్చుకుని ఉందన్నారు. జనగామా జిల్లా కొడకండ్ల ప్రాంతం పూర్తి వర్షాభావ ప్రాంతమని, అక్కడ మొక్కలు బతకడం చాలా కష్టమని, పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే నేడు ఆ పాఠశాల పచ్చదనంతో కళకళలాడుతుందన్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి కేజీబీవీలో నాలుగు ఎకరాల స్థలం ఉంటే అందులో రెండు ఎకరాలలో 2000 మొక్కలు నాటి వాటిని వందకు వందశాతం బతికించారని తెలిపారు. అదేవిధంగా సంగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 34 ఎకరాల ఖాళీ స్థలం ఉంటే 3400 మొక్కలు నాటి 3200 మొక్కలు పరిరక్షించారని చెప్పారు. ఈ స్కూళ్లను హరితహారం మోడల్ స్కూళ్లుగా గుర్తించి వాటిని సందర్శించి రావాలని అధికారులకు సూచించారు. ఆహ్లాదకర వాతావరణం ఉండాలంటే కళ్ల ముందు పచ్చదనం, నీరు ఉండాలన్నారు. ఇందులో ప్రస్తుతం పచ్చదనం పెంచేందుకు మనం పూర్తి కృషి చేయాలని అధికారులను కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్ర, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి.కె జా, ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పాఠశాల విద్యాశాఖ ఇన్ ఛార్జీ కమిషనర్ అధర్ సిన్హా, ఇతర అధికారులు, ఆయా జిల్లాల విద్యాశాఖ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

kadiyam srihari 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *