
కరీంనగర్: హరితహరం కార్యక్రమాన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలను చైతన్య పరిచి భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలని ఆమె అన్నారు. సమిష్టి కృషితో లక్ష్యాలను సాధించాలన్నారు. శాఖా పరంగ చేపట్టిన కార్యక్రమాలను డాక్యుమెంటేషన్
చేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలతో శ్రమదానం చేయించాలని ఆమె సూచించారు. అటవి శాఖ, ఎక్త్సెజ్, హర్టికల్చర్, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్, డ్వామా, ఎస్.ఆర్.ఎస్.పి., విద్యాశాఖ, పరిశ్రమలు, ఎన్.టి.పి.సి., కేశోరాం సిమెంట్ వంటి సంస్ధల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పై ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరితహరం కార్యక్రమం ప్రారంభానికి ముందే గుంతలు త్రవ్వించాలని అన్నారు. అవసరమైన శిక్షణ, సూచనలు అందించాలని అన్నారు. ఎక్త్సెజ్ శాఖ ద్వారా 6 లక్షల ఈత, తదితర మొక్కలను చెరువు గట్ల పై నాటాలన్నారు. పూలు, పండ్లనిచ్చే మొక్కలను పలు ప్రాంతాలలో నాటాలన్నారు. విద్యా సంస్ధలు, వసతి గృహాల పరిసర ప్రాంతాలలో విద్యార్ధులచే మొక్కలు నాటించాలన్నారు. పరిశ్రమలు వంటి ప్రాంతాల్లో కూడా మొక్కలను పెంచాలన్నారు. ఈ సమన్వయ సమావేశంలో డి.ఎఫ్.ఒ. వినోద్ కుమార్, ఎక్త్సెజ్ సూపరిండెంట్ శంకరయ్య, జిల్లా పరిషత్ సిఇఒ సూరజ్ కుమార్, డ్వామా పిడి గణేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.