హరితహరం కార్యక్రమాన్ని రొటీన్ గా చూడొద్దు….

*హరితహారంలో పనితీరు ఆధారంగానే అధికారులు, సిబ్బంది ప్రతిభ మదింపు*
*జిల్లాల వారీగా కలెక్టర్లు, అధికారుల పనితీరుకు  ప్రభుత్వం ర్యాంకింగ్ ఇస్తుంది*
*ఒక్కో గ్రామంలో నలభై వేలకు తగ్గకుండా మొక్కలు నాటాలి*
*పట్టణ ప్రాంతాల్లో అందమైన అర్భన్ పార్కులకు ప్రాధాన్యత నివ్వాలి*
*మంచి వర్షాలను సద్వినియోగం చేసుకుంటే హరితహారం విజయవంతం*
*అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి
రజత్ కుమార్*
తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రొటీన్ పథకంగా చూడొద్దని, భవిష్యత్ ప్రజా జీవితంలో ముడిపడి ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతా పథకంగా దీనిని అమలు చేయాలని అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. కలెక్టర్లతో సహా అందరు అధికారుల పనితీరు హరితహారంలో ఆధారంగానే ప్రభుత్వం మదింపు చేస్తుందని, దీని ఆధారంగానే జిల్లాల వారీగా ర్యాంకులను కూడా ఇస్తుందని వెల్లడించారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడో విడత హరితహారం పురోగతిపై  ఆయన సమీక్షించారు. వర్షాలకు అంతరాయం వల్ల హరితహారంలో కొంత విరామం వచ్చినా ఇప్పుడు కురుస్తున్న మంచి వానలను సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటే కార్యక్రమంలో మరింత వేగం పెంచాలన్నారు. జిల్లాల  జిల్లాల వారీగా వర్షపాతం, నాటిన మొక్కలు, జియో ట్యాగింగ్, గ్రీన్ బ్రిగేడ్ ల ఏర్పాటు, పండ్ల మొక్కల పంపిణీ, ఉపాధి హామీ కూలీల లభ్యత వివరాలపై సమావేశంలో సమీక్షించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల అయినందున ఉపాధి హామీ కూలీల బకాయిల చెల్లింపు వీలున్నంత త్వరలోనే జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ సీజన్
ఉన్నప్పటికీ ఉపాధి హామీ కూలీలను వీలైనంతగా హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. మొక్కలు నాటడంలో టార్గెట్ పరంగా వెనుకబడిన జిల్లాలు ఇప్పటికైనా వేగం పెంచాలని, అదే సమయంలో రక్షణ చర్యలతో సహా, జియో ట్యాగింగ్ ను పూర్తి చేయాలని చెప్పారు. శాఖల వారీగా నాటాల్సిన మొక్కల విషయంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో సమన్వయ లోపం కనిపిస్తోందని, కొన్ని శాఖలు అనుకున్న స్థాయిలో హరితహారాన్ని పూర్తి చేయటం లేదని అన్నారు. ఇందుకోసం త్వరలోనే చీఫ్ సెక్రటరీ సమక్షంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శలు, ముఖ్య కార్యదర్శులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు
రజత్ కుమార్ వెల్లడించారు.

గ్రామ సభలు నిర్వహించటం, సంబంధిత అందరు అధికారులు వాటిల్లో పాల్గొన్ని హరితహారం ప్రాధాన్యత ప్రజలకు తెలిసేలా చేయాలని, గత రెండేళ్ల ఫలితాలను వారికి చూపించటం ద్వారా ప్రజా భాగస్వామ్యాన్ని మరింత పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కో గ్రామంలో నలభై వేలకు తగ్గకుండా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు.  జీహెచ్ ఎంసీ, హెచ్ ఎం డీ ఏ తో సహా పట్టణ ప్రాంతాల్లో హరితహారం కొనసాగుతున్న తీరుపై ముఖ్యమంత్రితో సహా అటవీ శాఖ మంత్రి జోగు రామన్నలు అంత సంతృప్తిగా లేరని అధికారులు వెల్లడించారు. హరితహారం ప్రధాన అవసరమే పట్టణ ప్రాంతాలకు ఉందని, ఆమేరకు మొక్కలు నాటడంతో పాటు, అన్ని అర్బన్ ప్రాంతాల్లో
అందమైన పార్కుల ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్లను సూచించారు. హరితహారం అమలులో ముందంజలో ఉన్న జగిత్యాల కలెక్టర్ శరత్ ను, పట్టణ ప్రాంత పార్కుల అభివృద్దికి కృషి చేస్తున్న వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలిని ఉన్నతాధికారులు అభినందించారు.
వీరి స్ఫూర్తితో మిగతా కలెక్టర్లు టీమ్ వర్క్ తో పనిచేయాలని కోరారు. సింగరేణి పరిధిలో ఉన్న జిల్లాల్లో హరితహారం అమలును మరింత వేగంగా చేయాలని, ఇంటింటికి మొక్కల పంపిణీని కూడా చేపట్టాలని సమావేశానికి హాజరైన విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా కోరారు.
ఈ వీడియో  కాన్ఫరెన్స్ కు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీకే ఝా, అదనపు అటవీ సంరక్షణ
అధికారి ఆర్.ఎం. డోబ్రియల్,  అటవీ, గ్రామీణ అభివృద్ది, ఆర్ & బి, నీటి పారుదల, విద్య,
సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *