హన్మకొండ-ఖాజీపేట వద్ద రెండో ఆర్వోబి నిర్మాణానికి రూ. 78 కోట్లు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారి

 

  • ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ణప్తికి స్పందించిన సిఎం కేసిఆర్
  • రాష్ట్ర నిధులతో ఆర్వోబి నిర్మాణానికి అంగీకారం
  • ఆర్వోబి నిర్మాణానికి రూ. 78 కోట్లు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ
  • హన్మకొండ- ఖాజీపేట మధ్య ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలనుంచి విముక్తి
  • ఉప ముఖ్యమంత్రి చొరవతో తీరిన వరంగల్ ప్రజల చిరకాల ఆర్వోబి డిమాండ్
  • ముఖ్యమంత్రి కేసిఆర్ కు వరంగల్ ప్రజల తరపున ఉప ముఖ్యమంత్రి కడియం ధన్యవాదాలు

 

హైదరాబాద్, సెప్టెంబర్ 04 : హన్మకొండ నుంచి ఖాజీపేటకు వెళ్లాలంటే ఆ ఒక్క రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) మాత్రమే మార్గం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా, మరమ్మత్తులు చేపట్టినా తొందరగా వెళ్లాలనుకునే వారికి నరకం కనపడాల్సిందే. ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించాలంటే ఆర్వోబి పక్కనే సమాంతరంగా మరొక ఆర్వోబి ఉండాలని వరంగల్ వాసులు చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ ఇన్నాళ్లుగా డిమాండ్ గానే మిగిలింది. గత కొంత కాలంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ వాసుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని హన్మకొండ-ఖాజీపేట ఆర్వోబి పక్కన మరొక సమాంతర ఆర్వోబి రావాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం చేస్తున్న ప్రయత్నాలకు రైల్వే శాఖ అధికారులు ప్రస్తుతమున్న ఆర్వోబి పక్కనే మరొక ఆర్వోబి నిర్మాణానికి అంగీకరించారు. కానీ రైల్వే నిబంధనల మేరకు ఒక ఆర్వోబి ఉండగా, మరొక ఆర్వోబికి నిధులు ఇవ్వలేమని చేతులెత్తేశారు. దీంతో కచ్చితంగా ఈ ఆర్వోబి రావాల్సి ఉందని పట్టుపట్టిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి కేసిఆర్ వద్దకు ఈ ప్రతిపాదనలు తీసుకెళ్లారు. హన్మకొండ-ఖాజీపేట మధ్య ఆర్వోబి ఒక్కటే ఉండడం, రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడం వల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే అధికారులు రెండో బ్రిడ్జి నిర్మాణానికి అంగీకరించినా…నిధులు ఇవ్వడానికి నిబంధనలు అడ్డువస్తున్నాయని చెప్పిన అంశాన్ని సిఎం కేసిఆర్ కు వివరించారు. దీంతో వరంగల్ ప్రజల ఇబ్బందులు గుర్తించి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన విజ్ణప్తి మేరకు రెండో ఆర్వోబి నిర్మాణానికి సిఎం నిధులు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రోడ్లు, భవనాల శాఖ ఈ ఆర్వోబి నిర్మాణం కోసం 78 కోట్ల రూపాయలను మంజూరుచేస్తూ జీవో 539 జారీ చేసింది. దీంతో వరంగల్ వాసుల చిరకాల డిమాండ్ హన్మకొండ-ఖాజీపేట రెండో ఆర్వోబి నిర్మాణం నెరవేరనుంది.  వరంగల్ వాసుల ట్రాఫిక్ సమస్యను తీర్చేవిధంగా హన్మకొండ- ఖాజీపేట మధ్య రెండో ఆర్వోబి నిర్మించడానికి సిఎం కేసిఆర్ అంగీకరించినందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సిఎం కు వరంగల్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.