
దేశంలోనే మొదటిసారిగా సింగిల్యూజ్డ్ ఫిల్టర్ డయాలసిస్ కేంద్రాలు. గద్వాలకు 100 పడకల మాతా శిశు వైద్యశాల వనపర్తిలో మెడికల్ కాలేజీకి ప్రయత్నాలు తెలంగాణలో సిఎం కెసిఆర్ సారథ్యంలో సర్కార్ దవాఖానాల్లో సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. దేశంలోనే మొదటి సారిగా 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా, అందులో సింగిల్ యూజ్డ్ ఫిల్టర్లు వినియోగిస్తుండటం కూడా దేశంలో మొదటి సారి అన్నారు. ఇలా అనేక విధాలుగా నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సోమవారం పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ వనపర్తి, గద్వాలల్లో మంత్రి లక్ష్మారెడ్డి 5 పడకల సింగిల్ యూజ్డ్ డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. వనపర్తిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, గద్వాలలో ఏరియా హాస్పిటల్ని జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్, 100 పడకల మాతా శిశు వైద్యశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ యూజ్డ్, అందునా 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. ఇప్పటికే వనపర్తి, గద్వాలతో కలుపుకుని ఏడు డయాలసిస్ సెంటర్లు ప్రారంభమయ్యాయన్నారు. ఇంతకు ముందు సిద్దిపేట, సిరిసిల్ల, సంగారెడ్డి, వనస్థలిపురం, మలక్పేట ఏరియా హాస్పిటల్స్లో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించామని, అవి విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. కిడ్నీ బాధితులకు వారంలో రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్ అవసరమవుతుందన్నారు. తెలంగాణ వచ్చే నాటికి కేవలం హైదరాబాద్లో ఒకటి రెండు హాస్పిటల్స్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలుండేవన్నారు. అయితే, ఆహారపు అలవాట్లు, మంచినీటిలోపాలు, వారసత్వ సమస్యలు వంటి కారణాల వల్ల సమాజంలో కిడ్నీబాధితులు పెరుగుతున్నారన్నారు. కిడ్నీ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరగాలని, ప్రజల్ని చైతన్య పరచాలని మంత్రి అన్నారు. కిడ్నీ సమస్యల మీద చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కిడ్నీసమస్యలతో బాధపడుతన్న వాళ్ళకు వైద్య సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒక్కో కిడ్నీ బాధితుడికి వారంలో కనీసం రెండు, మూడు సార్లు డయాలసిస్ అవసరమవుతుందన్నారు. అలాంటి వారు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం వ్యయ,ప్రయాసలతో కూడిన పని అని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మరింత భారమన్నారు. అందుకే ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా కిడ్నీ బాధుతలకి రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మందుల వినియోగం లో జాగ్రత్తలు అవసరమన్నారు. అతిగా, నొప్పుల మందుల వినియోగంతో కిడ్నీలు పాడవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలు భూ ఉపరితల నీటిని అందిస్తాయని, అందువల్ల కిడ్నీ సమస్యలేగాక, ఇతర సమస్యలేవీ రాకుండా నిరోధించవచ్చన్నారు. పరిశుద్ధమైన నీటి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఇక కెసిఆర్ కిట్ల పథకం విజయవంతం అవడం వల్లే ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగాయని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ దవాఖానాల మీద ప్రజలకు నమ్మకం పెరిగిందని, అందువల్ల సర్కార్ దవాఖానాలకు రోగులు తాకిడి పెరిగిందన్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు పెంచుతున్నామన్నారు. త్వరలోనే పోస్టుల భర్తీ కూడా పూర్తవుతందన్నారు.