
సమ్మక్క-సారాలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు
జనవరి 15లోగా పనులన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్నికోరతాం
జనవరి 2న ఢిల్లీకి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిని కలవనున్న దేవాదాయ శాఖ మంత్రి, రాష్ట్ర ఎంపీలు
సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష
మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందులాల్, ఎంపీ సీతారాం నాయక్ తో పాటు ఉన్నతాధికారులతో సమావేశం
హైదరాబాద్: సమ్మక్క-సారాలమ్మ జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లను చేయాలని డిప్యూటీ సీయం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జనవరి15లోగా అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహబుబ్ బాద్ ఎంపీ సీతారం నాయక్, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్, మేడారం ఆలయ పాలక మండలి చైర్మన్ కాక లింగయ్య,భూపాల్ పల్లి కలెక్టర్ మురళీ,ఎస్పీ భాస్కరన్, ఐటీడిఏ పీవో చక్రధర్, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.
సమావేశనాంతరం డిప్యూటీ సీయం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ…గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మేడారం జాతరకు రూ.80 కోట్లు కేటాయించారన్నారు. ఆయా శాఖ అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహించామన్నారు. జనవరి 15లోగా పనులన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జనవరి 18న జాతర ఏర్పాట్లపై మరోసారి మేడారంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందులాల్ తో కలిసి సమీక్ష నిర్వహించనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు. గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. దీనిపై జనవరి 2న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆద్వర్యంలో రాష్ట్ర ఎంపీలు ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహరాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ ను కలుస్తారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క- సారలమ్మల జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవాకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందులాల్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రద్ధ వహించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, స్నాన ఘట్టాల వద్ద తగిన ఏర్పాటు చేయాలని, పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలన్నారు. రహదారుకిరువైపుల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని పోలీసులకు సూచించారు.పోలీ ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను
పర్యవేక్షించాలని పేర్కొన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. మరోవైపు జాతరలో బెల్లం విక్రయం, తల నీలాల వేలం, చిరు షాపుల నిర్వహణ,తాత్కలి మద్యం దుకాణాలు, ఇతర పనులన్ని స్థానికులకే ఇవ్వాలని అధికారులకు సూచించారు.
కాగా వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరుగునుంది. 31వ తేదీ తొలిరోజు సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1 న రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 3న (శనివారం) అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. మేడారం జాతర రూట్ మ్యాప్ యాప్ ఆవిష్కరణ సమ్మక్క-సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు కోసం మేడారం గైడ్ అనే యాప్ ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు రూట్ మ్యాప్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.